
భీంపూర్, సెప్టెంబర్ 4 :ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తూనే అవసరమైన మౌలి క వసతులను కల్పిస్తున్నది. దీంతో పాటు ఉపాధ్యాయులూ తమవంతు పాత్ర పోషిస్తే, ఆ బడి దేవాలయంగా మారుతుంది. అయితే బడిని నాలుగు గోడల తరగతి గదిలా కాకుండా, పిల్లలకు జ్ఞానభాండాగారంగా తీర్చిదిద్దేవారు కొం దరు ఉంటారు. వారిలో ఈ శ్రీకాంత్ మాస్టారు ముందుంటారు. ఆయన గతంలో బదిలీపై వస్తున్న ప్రాంతంలో అక్కడి పిల్లలు ఏడ్వడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది.
వృత్తిధర్మమే నమ్మిన సిద్ధాంతం..
సాయిరి శ్రీకాంత్.. భీంపూర్ మండలం అంతర్గాం యూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇప్పటికే 19 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ పనిచేసినా చిత్తశుద్ధితో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రతి పాఠశాలలో పేద, మధ్యతరగతి పిల్లలకు ఒక బంధువైపోయాడు. తలమడుగు మండలం కజ్జర్ల పాఠశాల నుంచి గతంలో ఇక్కడికి వస్తున్నప్పుడు ఊరు ఊరే మాస్టారును చూసి విలపించింది. ఒక ఉపాధ్యాయుడికి ఇంత స్పందన ఉన్నదంటే దానికి ఆయన సేవాభావమే కారణం.
తన జీతంతో పేద పిల్లలకు జీవితం..
తల్లి లేదా తండ్రి లేని పేద ఎనిమిది మంది విద్యార్థినుల పేరిట పోస్టాఫీసులో నెలనెలా కొంత ఆర్డీ కడుతున్నాడు. ఇలా సర్కారు బడి పిల్లల కోసమే తన వేతనంలో 10 శాతం వెచ్చిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాకారం అనంతరం వచ్చిన సమ్మె కాలపు వేతనం రూ.10 వేలు, పదో తరగతి పరీక్షల స్పాట్లో వచ్చిన భత్యం కూడా బడి కోసమే ఇచ్చి, అభివృద్ధి పనులకు ఖర్చు చేశాడు. అలాగే పేద విద్యార్థుల తల్లిదండ్రులకు వసుధ, సాయి వైకుంఠ ట్రస్టు లాంటి సంస్థల చేయూతతో జీవనోపాధికి మేకలు, గేదెలు, కుట్టుమిషన్లు ఇప్పించారు. యాదశంకర్ ఫౌండేషన్ సంస ఆధ్వర్యంలో రెండేళ్లుగా మండలంలోని పలు పాఠశాలలకు రూ. 10 లక్షల విలువైన స్టడీమెటేరియల్, బ్యాగులు ఇప్పించారు. శ్రీకాంత్ కుమార్తె లాస్యను సర్కారు బడిలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
శ్రీకాంత్ అందుకున్న అవార్డులు ..
2014లో ఎస్ఎస్ఏ ద్వారా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
2015లో జిల్లా విద్యాశాఖ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
2017లో భారత వికాస్ పరిషత్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
2018లో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్ నుంచి బడితోట అవార్డు.