బోథ్ మండలంలోని సొనాల గ్రామం.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల కల్పనతో రూపురేఖలు మార్చుకుంటున్నది. గడిచిన రెండేండ్లలో నిధులను సక్రమంగా ఖర్చుచేస్తూ అభివృద్ధిలో పయనిస్తున్నది. మండలంలోనే రెండో అతిపెద్ద గ్రామం.. మిగతా జీపీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కాగా, గ్రామస్తుల్లో సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది.

మండలంలోని సొనాల గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. గడిచిన రెండేండ్లలో గ్రామానికి పల్లె ప్రగతి, ఎస్ఎఫ్సీ, సీఎఫ్‌సీ, జనరల్ ఫండ్ కింద రూ.2.30 కోట్ల నిధులు వచ్చాయి. వీటిలో సుమారు రూ.50 లక్షలతో అవసరమున్న చోట సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అనుబంధ గ్రామమైన రాజన్నపల్లెలో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. గ్రామంలో సేకరించిన చెత్త వేసేందుకు రూ.2 లక్షలతో డంప్‌యార్డు నిర్మించారు. రూ.3 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠధామంలో మిగిలిన పనులు పూర్తి చేయించారు. నీటి తొట్టె నిర్మించారు. బస్టాండ్ నుంచి గ్రామం లోపలి వరకు ఆర్అండ్బీ రోడ్డు వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, దశాబ్దాలుగా ఎదురవుతున్న ప్రధాన సమస్యను తీర్చారు. సుమారు రూ.22 లక్షల ఉపాధి హామీ, వ్యవసాయ శాఖ నిధులతో రైతు వేదిక నిర్మాణం చేపట్టారు. బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. గ్రంథాలయం కోసం గదిని సమకూర్చారు. రూ.3.50 లక్షలతో గ్రామపంచాయతీ పక్కన గల ఖాళీ స్థలాన్ని భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేశారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రామాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందరి సహకారంతో పంచాయతీ పాలకవర్గ నిర్ణయాలతో అవసరం ఉన్న చోట అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. ప్రధాన సమస్యగా ఉన్న ఆర్అండ్బీ రోడ్డు వెంబడి గ్రామం లోపలి వరకు డ్రైనేజీ నిర్మించాం. మండలంలోనే రెండో పెద్ద జీపీ అయిన సొనాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతాం.