
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషిచేయాలని నాబార్డ్ అధికారి రాంరెడ్డి సూచించారు. మండలంలోని సాలెవాడ(బి) గ్రామంలో సహకార బ్యాంక్ ఉట్నూర్ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సౌజన్యంతో మంగళవారం ఖాతాదారులతో పాటు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీలు పొందాలని, బ్యాంక్లో పొదుపు పాటించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలతోపాటు వ్యవసాయ రుణాలపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ ఉట్నూర్ ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్, ఉట్నూర్ పీఏసీఎస్ సీఈవో వెంకట్, సర్పంచ్ విజయబాజీరావ్, గ్రామ పటేల్ నాగోరావ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.