శాంతి స్వరూపానికి చిహ్నంగా గౌతమ బుద్ధుడే కనిపిస్తాడని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో బుద్ధుడి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్ఠించారు. సమాజ శాంతికి ఆయన బోధనలు ఆచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవా లని సూచించారు. ప్రజలు నాలుగు కాలాల పాటు గుర్తుంచుకునేలా వివిధ కార్యక్రమాలను కోనప్ప చేపడుతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ విఠల్ కొనియాడారు.
సిర్పూర్(టీ), జూన్ 8 : శాంతి స్వరూపానికి చిహ్నం గౌతమ బుద్ధుడనీ, సిర్పూర్ నియోజకవర్గం శాంతి నిలయంగా మారాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆకాంక్షించారు. సిర్పూర్ మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో సొంత ఖర్చుతో ఎమ్మెల్యే గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని బౌద్ధ భిక్షువులు, బంతిజీల ప్రత్యేక ప్రార్థనల నడుమ వైభవంగా నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సేవకే అంకితమన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్లగడ్డలోని నిపుణులైన కళాకారులతో తయారు చేయించానని చెప్పారు. ముందుగా కాగజ్నగర్ పట్టణం నుంచి నాగమ్మ చెరువు వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బౌద్ధ దమ్మ ర్యాలీ తీశారు. విగ్రహానికి దాదాపు 50 మంది బౌద్ధ భిక్షువులు, బంతిజీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.