ఎదులాపురం, జూన్ 8 : వానకాలం సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో జిల్లాలో మలేరియా, డెంగీ ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలని వైద్య సిబ్బందికి ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు కీటకజనిత వ్యాధుల నియంత్రణపై అవగాహన నిర్వహించారు. ముందుగా కార్యక్రమ్నా కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏడెనిమిదేండ్ల క్రితం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులతో ఇబ్బందులుండేవన్నారు. ప్రస్తుతం ముందస్తు ప్రణాళికలతో గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధుల సహకారం, అధికారులు ముందస్తు చర్యలతో మలేరియా, డెంగీ మరణాలు లేవన్నారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వాటిని ప్రజలకు వివరిస్తూ, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతున్నామన్నారు. ఏప్రిల్లో ఇంద్రవెల్లి పరిధిలో జ్వరాలు రావడం, వెంటనే వైద్య, పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం జోనల్ మలేరియా అధికారి సునీల్ మాట్లాడుతూ.. జిల్లా అధికార యంత్రాంగం సమష్టి చర్యలు, కలెక్టర్ మార్గదర్శనంలో జ్వరాలతో మరణాలు సంభవించలేదన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకోవడం, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పనులతో కేసులు ఒకటిలోపు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంట్రమాలజిస్ట్ నాగయ్య, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఎంవో శ్రీధర్, వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.