మంచిర్యాల, మార్చి 29, నమస్తే తెలంగాణ : చెన్నూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేలా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెన్నూర్‌లోని దవాఖానను ఇప్పటికే 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయించారు. ప్రస్తుతం రూ.7 కోట్ల నిధులతో భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో దవాఖానకు మరిన్ని నిధులు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీశ్ రావుతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఇటీవల భేటీ అయ్యారు. చెన్నూర్ హాస్పిటల్లో రూ.14.50 కోట్లు మౌలిక సదుపాయాలు, యంత్ర సామగ్రికి మరో రూ.2.50 కోట్ల నిధులు కలిపి మొత్తంగా రూ.17 కోట్లు మంజూరు చేయాలని, సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు. దీంతో పాటు జైపూర్ మండలం కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విప్ సుమన్ ప్రతిపాదనలు చేయగా మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రికి విప్ కృతజ్ఞతలు తెలిపారు.
పాత దవాఖాన స్థానంలోనే కొత్త హాస్పిటల్‌ను నిర్మిస్తుండడంతో వైద్య సేవల్లో రోగులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మండలంలోని ఎల్లక్కపేట సింగరేణి డిస్పెన్సరీలో అన్ని సౌకర్యాలతో రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. 1937లో నిజాం సర్కారు ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ పేరుతో 10 పడకల దవాఖానను చెన్నూర్‌లో నిర్మించింది. ఈ దవాఖానకు చెన్నూర్ పట్టణంతో పాటు కోటపల్లి, వేమనపల్లి మండలాలతో పాటు పక్కనున్న మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వైద్యం కోసం వచ్చేవారు. సదరు హాస్పిటల్‌ను 1975లో 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం దవాఖాన శిథిలావస్థకు చేరడం, రోగులు భయాందోళన చెందుతుండడంతో ప్రభుత్వ విప్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ.7 కోట్లతో అధునాతన భవన పనులు మొదలు పెట్టారు. ఇటీవలే చెన్నూర్‌లో భవన నిర్మాణ పనులను ఎంపీ వెంకటేశ్ నేతతో కలిసి విప్ బాల్క సుమన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాగా, చెన్నూర్ దవాఖానలో మెరుగైన వసతులు ఏర్పడుతుండడంతో, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.