ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, ఫిబ్రవరి26 : శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో జయంతిని ఘనంగా నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్లు కోవలక్ష్మి, జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్నారని, సమాజంలో ఉన్నతమైన వ్యక్తులను స్మరించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. బంజారాల అభ్యున్నతికి రాష్ట్ర సర్కారు అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. సేవాలాల్ ప్రకృతి ప్రేమికుడని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. సన్మార్గంలో నడవాలని కోరారు. ప్రతి ఇంటా ఆడ పిల్లలను.. మగపిల్లలతో సమానంగా చూడాలని సూచించారు. అంతకుముందు బంజారాలు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. వేడుకల్లో బంజారా మహిళలు, యువతులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, టీఆర్ఎస్పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంనాయక్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ సురేశ్‌కుమార్, జిల్లా గిరిజన శాఖ డీడీ మణెమ్మ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ శంకర్, గౌరవ అధ్యక్షుడు గుణవంతరావు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, గోపాల నాయక్, నాయకుడు ఇందులాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది భైంసా మండలంలోని సిద్దూర్ గ్రామ పంచాయతీ భవనం. ఈ గ్రామం మిర్జాపూర్కు అనుబంధంగా ఉండేది. 750 జనాభా ఉండడంతో కొత్త జీపీగా ఏర్పడింది. 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గూన ఇల్లులోనే పరిపాలన కొనసాగుతున్నది. ప్రస్తుతం పంచాయతీ భవనం కోసం ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే కొత్త భవనం నిర్మాణం కానుంది. పరిపాలన కూడా సులభతరం కానుంది.