జైనథ్, ఫిబ్రవరి 27: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్(టీ) గ్రామంలో నిర్మించిన శ్మశానవాటికను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే గంగపుత్ర, ఎస్సీ, రెడ్డి సంఘాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని అన్నారు. ఈ పథకాలను పక్కనున్న మహారాష్ట్ర, గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రాంపూర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే జోగు రామన్న పరిశీలించారు. సొంత స్థలంలో 100 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ ఇండ్లను నాణ్యతగా నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలోని గిమ్మలో 28, గూడలో 29, జైనథ్‌లో 135 ఇండ్లను నిర్మించామన్నారు.
దీపాయిగూడలో తూము రవి బృందం నటించిన రేణుక ఎల్లమ్మ వీధి నాటకాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు వీక్షించారు. ఈ సందర్భంగా కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ గంగన్న, నాయకులు పోతారెడ్డి, అశోక్, కిష్టారెడ్డి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు యువత ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్లవరిస్ట్, డెకరేషన్ సంఘానికి సంబంధించిన 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ అజయ్, నాయకులు యూనిస్ అక్బానీ, మమత, ఫ్లవరిస్ట్, డెకరేషన్ సంఘం అధ్యక్షుడు ఖుర్షీద్, బుచ్చన్న, మహేశ్, నగేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.