కుంటాల, ఫిబ్రవరి 27 : కుంటాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. మండల కేంద్రం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతి పనులు కుంటాలకు బాగా కలిసి వచ్చాయి. సర్పంచ్, పాలకవర్గ సభ్యుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి గ్రామాన్ని పచ్చదనంగా మార్చారు. దీనికి తోడు రూర్బన్ పథకంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రజలకు మౌలిక సదుపాయాలు దశలవారీగా సమకూరుతున్నాయి. సర్పంచ్ సమత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
గతంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారంతో నిండి ఉండేవి. ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నివారణకు చర్యలు చేపట్టింది. దీంతో ఏళ్ల నుంచి పరిష్కారానికి కాని సమస్యలు పల్లె ప్రగతి ద్వారా తీరాయి. ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను నిత్యం సేకరిస్తూ పది మందికి పైగా పారిశుధ్య కార్మికులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
హరితహరం కార్యక్రమంలో భాగంగా సర్పం చ్ సమత ప్రత్యేక చొరవతో ఇంటింటికీ వివిధ రకాల మొక్కలు పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా అవగాహన కల్పించారు. గ్రామంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. దీంతో కుంటాలలో మొక్కలతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.
రూర్బన్ పథకం ద్వారా గ్రామంలో రూ. కోటి వ్యయంతో ఆడిటోరియం, సీనియర్ సిటిజన్ భవనం, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, సెంట్రల్ లైటింగ్, అంగన్వాడీ భవనాల పనులు చేపట్టారు. వీటితో పాటు గ్రామంలో రూర్బన్ పథకం ద్వారా మార్కెట్ యార్డు, మహిళా సంఘాల అభివృద్ధ్దికి ప్రత్యేక భవనాలు నిర్మించారు.
గ్రామ పంచాయతీ నిధులతో శ్మశాన వాటికను మరింత అభివృద్ది చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, తదితర పనులు చేపట్టారు. కుంటాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతూ సర్పంచ్ సమత ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించకముందు గ్రామంలో అనేక సమస్యలు రాజ్యమేలాయి. వార్డుల వారీగా ఇచ్చిన హామీల మేరకు గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నా. ఆయా కాలనీల్లో సీసీ రోడ్లతో పాటు మిగిలిన పనులను రానున్న కాలంలో పూర్తి చేస్తా. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తూ జవాబుదారీగా పని చేస్తా. – సమత, సర్పంచ్, కుంటాల
కుంటాలలో సర్పంచ్, వార్డు సభ్యులు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలు తోడ్పాటునందిస్తుండడంతో గ్రామాభివృద్ధి వేగంగా జరుగుతుంది. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ సమస్యల పరిష్కారానికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తున్నది. కుంటాలలో 90 శాతానికి పైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. -తాటి మహేశ్, కుంటాల