ఎదులాపురం, ఫిబ్రవరి 26 : షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు త్వరితగతిన మంజూరు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ఉపకార వేతనాలపై వసతిగృహాల సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, విద్యాశాఖాధికారులతో శనివారం సమీక్షించారు. ఉపకార వేతనాలకు ప్రభుత్వం కోట్లాది నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం శోచనీయమన్నారు.విద్యార్థులకు ఉపకార వేతనాల దరఖాస్తులను మీసేవ కేంద్రాల ద్వారా నిర్వహించుకునేలా అవగాహన కల్పించి అవనరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఆధార్ సీడింగ్, మీసేవ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలు, ఆన్లైన్ దరఖాస్తులు తదితర కారణాలతో విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం లేదని, వాటిని పరిశీలించి నివృత్తి చేయాలన్నారు. ఆదిలాబాద్, తాంసి, గుడిహత్నూర్, తలమడుగు తదితర మండలాల్లోని విద్యార్థులకు మీసేవ కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా కేంద్రాలను సందర్శించాలని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను ఆదేశించారు. వచ్చే నాలుగైదు రోజుల్లోగా ఉపకార వేతనాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసి అర్హులందరికీ అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 3,338 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 1,838 మంది హార్డుకాపీలు మాత్రమే అందజేశారని, మిగితా వారు అందజేస్తున్నారని డీఎస్సీడీవో భగత్ సునీత తెలిపారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల్లో 3,006 మందికి గాను 1,194 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. సంక్షేమ అధికారులు, ఆయా పాఠశాలలు, ఉపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్లు సమన్వయంతో విద్యార్థులకు సహకరించి ఉపకార వేతనాలు అందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. డీఈవో ప్రణీత, డీఐఈవో సీ రవీందర్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ బీ రవి, సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు పూర్ణచందర్, సంక్షేమశాఖల అధికారులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్ (టీఎస్‌ఐఆర్‌ఐఐ) ద్వారా ఆర్థిక సహకారం అందించడానికి ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అండ్ సీ విభాగం జూలై 2021న మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు. నోడల్ ఏజెన్సీగా టీఎస్ఐసీ వ్యవహరించి, టీఎస్‌ఐఆర్‌ఐఐ ద్వారా రూ.30 లక్షల ప్రోత్సాహకాల కోసం కార్పస్ ఫండ్‌కు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర గుర్తింపు పొందిన ఆవిష్కరణ, స్టార్టప్‌లు లేదా పూర్తిగా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయబడ్డ ఆవిష్కరణలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతని పేర్కొన్నారు. https://teamtsic.telangana.gov.in/tsiri-incentives పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలు సైతం తెలుసుకోవచ్చని తెలిపారు.