లోకేశ్వరం, ఫిబ్రవరి, 26 : పిలిస్తే పలికే ప్రతిరూపంగా బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారం విరాజిల్లుతున్నది. శివనామస్మరణతో బ్రహ్మేశ్వరాన్ని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. కొన్నేళ్ల క్రితం మండలంలోని గోదావరి ఒడ్డున వెలిసిన బ్రహ్మేశ్వర ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. బ్రహ్మేశ్వరాలయం నిత్య పూజలతో వెలుగొందుతున్నది. ఇక్కడికి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. శివరాత్రి రోజున గోదావరిలో స్నానమాచరిచి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
కాకతీయుల కాలంలో గణపతి దేవుడి పాలనలో ఏళ్ల కిందట బ్రహ్మేశ్వరాలయాన్ని రాతితో నిర్మించారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. గోదావరి ఈ ఆలయ సమీపంలో ఉత్తరం దిక్కుగా ప్రవహిస్తూ ఉత్తర వాహినిగా పేరుగాంచింది. ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి బ్రహ్మేశ్వరున్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు. దీనికితోడు సూర్యోదయం వేళ కాంతి కిరణాలు గోదావరిలోని నీటిపై పడి నేరుగా ఆలయంలోని శివలింగంపై పడతాయి. అత్యంత ప్రాశస్తి గాంచినదిగా పేర్కొంటున్నారు. మండలంలోని కనకాపూర్ గ్రామ శివారులోని గోదావరి ఒడ్డున ఆలయం నిర్మించడంతో వర్షాకాలంలో గోదావరి ప్రవాహానికి ఈ ఆలయం ముంపునకు గురవుతుంది. ఏళ్ల తరబడి నీటిలో ఉండేది. దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో మరింత ముంపు నీటిలోనే ఈ ఆలయం ఉండాల్సి వచ్చేది. కొన్నేళ్ల కిందట నేపాల్ నుంచి వచ్చిన సత్యానంద స్వామి రాకతో బ్రహ్మేశ్వరాలయం బయటి ప్రపంచానికి తెలిసింది. దక్షిణ భారతదేశంలో శివాలయం పరిరక్షణ కోసం నేపాల్ నుంచి కొందరు స్వాములు వచ్చారు. ఇందులో భాగంగా శ్రీ సత్యానంద స్వామి ఈ ప్రాంతానికి వచ్చి ముంపునకు గురవుతున్న బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించారు. ఆలయాన్ని తెరిచి దూపదీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. దీంతో పాటు భక్తులు బ్రహ్మేశ్వరున్ని నమ్ముకొని కోరుకున్న కోరికలు ఫలిస్తుండడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది.
ప్రతి శివరాత్రి మూడు రోజల పాటు జాతర నిర్వహించనున్నారు. మండల భక్తులే కాకుండా ముథోల్, భైంసా, కుంటాల, దిలావర్పూర్, నిర్మల్‌తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు.