నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపర్చి అమలు చేసుకుంటున్నామని, అలాంటి చట్టాలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, నాల్గో తరగతి జడ్జి హరీశ అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న వివిధ పథకాలపై శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో అవగాహన కల్పించారు. భారత సమాజంలో పౌరులకు కల్పించిన హక్కులను కాపాడడంలో మండల మండల న్యాయ సేవా సంస్థ కృషిచేస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయం అందించే బాధ్యత న్యాయ సేవా సంస్థ తీసుకుంటుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్చి 12న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి అజేష్కుమార్, జూనియర్ సివిల్ జడ్జి రామలింగం, అనూష, సఖి నిర్వాహకురాలు మమత పాల్గొన్నారు.