తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ ప్రజల రవాణా సౌకర్యార్థం తెలంగాణ సర్కారు రూ.96 కోట్లతో భారీ వంతెన నిర్మించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నదిపై 2016లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి, 2020 ఆగస్టులో పూర్తి చేసింది. 26 భారీ పిల్లర్లు, 25 స్లాబులు, 9 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల ఎత్తు, దాదాపు కిలోమీటర్ పొడవున వంతెనను సుందరంగా కట్టారు. ఇరువైపులా విద్యుద్దీపాలు అలంకరించగా.. పాదచారుల కోసం ఫుట్పాత్లు వేశారు. – చింతలమానేపల్లి, మార్చి 29
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చింతలమానేపల్లి ప్రాంతం అభివృద్ధి ఆమడ దూరంలో ఉండేది. రవాణా కష్టంగా, ప్రమాదకరంగా ఉండగా.. ప్రజలు నానా వ్యయప్రయాసాల కోర్చి ప్రయాణాలు చేసేవారు. ఈ ప్రాంతంలో తెలంగాణ-మహారాష్ట్రను ప్రాణహిత వేరుచేసేది. మన జిల్లా సరిహద్దుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి, ఆళ్లపెల్లి పట్టణాలు ఉండగా.. మన వారు సామగ్రి కోసం ఆ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రమాదమని తెలిసినా నదిలో నాటు పడవల సహాయంతో వెళ్లేవారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగిన సంద ర్భాలు కూడా ఉన్నాయి. సులువుగా అక్కడి వారు ఇక్కడికి.. ఇక్కడివారు అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాణిజ్య, మానవ, సాంస్కృతిక రంగాల్లో కూడా తేడా కన్పించేది. వంతెన లేని కారణంగా చంద్రాపూర్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు వెళ్లాలంటే వందలాది కిలోమీటర్లు అదనపు ప్రయాణం చేయాల్సి వచ్చేది.
ప్రాణహితపై బ్రిడ్జి లేనికారణంగా తెలంగాణ-మహారాష్ట్రవాసులు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీసుకెళ్లారు. కేసీఆర్ ప్రజల సౌకర్యార్థం నిధులు మంజూరు చేసి వంతెన కూడా కట్టించారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ర్టలోని గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలు, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు రవాణా సులభంగా మారింది. రెండు ప్రాంతాల మధ్య దూరం, వ్యయం తగ్గాయి.కాళేశ్వరం, వరంగల్ ప్రాంతాలకు తిరువంచ నుంచి నేరుగా వెళ్లేందుకు అవకాశం కలిగింది. రెండు ప్రాంతాల్లో అడవులు విస్తారంగా ఉండడంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. పర్యాటకులు కూడా చాలా మంది క్యూ కడుతున్నారు. దీనికితోడు మండల కేంద్రం నుంచి గూడెం వరకు రవాణా పెరుగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ప్రాంతంలో హోటళ్లు, ఆటో మొబైల్ రంగం దుకాణాలు విస్తారంగా వెలిశాయి. ఈ క్రమంలో గూడెం, కేతిని, దిందా, చిత్తాం, కోయపల్లి, కర్జెల్లి గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
గతంలో మాకు తెలంగాణలో ఉన్న బంధువులను కలవాలంటే ఇబ్బందిగా ఉండేది. వంతెన పూర్తయిన తర్వాత సులభంగా కలుస్తున్న. యాదికొచ్చినప్పుడు మా బంధువుల ఇంటికి వచ్చి వెళ్తున్న. గతంలో బంధువుల ఇంటికి రావాలంటే వందల కిలోమీటర్లు వెళ్లి రావల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం పదుల కిలోమీటర్లలో మా బంధువులను కలుస్తున్నాం. అంతే కాకుండా మా బంధుత్వాల పెరిగి పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.
– ఎల్కరి మల్లయ్య, జంబుగావ్, మహారాష్ట్ర.
చిరకాల స్వప్నం నెరవేరింది..
వంతెన నిర్మాణంతో వ్యాపార సంబం ధాలు మెరుగు పడ్డాయి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వంతెన నిర్మాణానికి చాలా కృషి చేశారు. సీఎం కేసీఆర్కు తెలిపి నిధులు మంజూరు చేయించ డంతోపాటు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతి పదిన పూర్తి చేయించారు. ప్రస్తుతం ప్రారంభం కావడంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటాం. – డుబ్బుల నానయ్య, ఎంపీపీ, చింతలమానేపల్లి.
వంతెన నిర్మాణంతో గూడెం గ్రామం అభివృద్ది బాట పట్టింది. మహారాష్ట్రలో ఉన్న అహెరి తాలూ కా ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలంటే గతంలో ప్రమాదకరమని తెలిసినా నాటు పడవలపై వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఆ బాధలు తప్పాయి. మా సరిహద్దు గ్రామాల ప్రజలు అందరం బ్రిడ్జి పూర్తికావడంతో చాలా సంతోషంగా ఉన్నాం. – రాఘవరెడ్డి, సర్పంచ్, చింతలమానేపల్లి.