ఆదిలాబాద్ రూరల్, జూలై 17 : బోనాలకు ఎంతో విశిష్టత ఉందని, తెలంగాణ సంప్రదా యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని సంజయ్‌నగర్, అఖిల గాండ్ల తేలికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బోనమెత్తుకుని ముందు నడిచారు. ఈ సందర్భంగా ఆయా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని పోచమ్మ తల్లిని ప్రార్థించామన్నారు. మహిళలు భారీగా బోనమెత్తి అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీ గా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. శోభా యాత్ర సందర్భంగా పోతరాజుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అశోక్ రోడ్‌లోని పెద్ద పోచమ్మ తల్లి ఆలయంలో బోనా లు సమర్పించారు. అలాగే పట్టణంలోని మహాలక్ష్మీ వాడ, అశోక్ రోడ్‌లోని పోచమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్యక్ర మంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ బడాల సుజాత, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు స్వరూప, మమత, మహిళలు పాల్గొన్నారు.