మంచిర్యాల(నమస్తే తెలంగాణ), జూలై 17 : కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నది. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బడాబాబులకు కట్టబట్టేందుకు తహతహలాడుతున్నది. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయాలని కుటిల ప్రయత్నం చేస్తున్నది. వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది. వడ్లు కొనబోమని తెగేసి చెప్పింది. నూకలు తినిపించడం నేర్పించాలని అవహేళన చేసింది. ప్రత్యామ్నాయ పంటల దిశగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంటే, వరే వేయాలని, కేంద్రాన్ని ఒప్పించి కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నమ్మించి రైతులను ఆందోళనకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున మరోసారి నిరసన గళం వినిపించేందుకు రాష్ట్ర ఎంపీలు సన్నద్ధమయ్యారు. పలు అంశాలపై కేంద్ర వైఖరిని ఎండగట్టనున్నట్లు పెద్దపార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు.
కార్పొరేట్లకు ధారాదత్తానికి కుట్ర..
కేంద్రం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లాభాల్లో అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. సింగరేణి సంస్థ ఏడేళ్లలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తికి ఎదిగింది. అమ్మకాలు, లాభాలు, అభివృద్ధిలో సింగరేణి సంస్థ గణనీయమైన వృద్ధి సాధించింది. అందుకే తెలంగాణకే మణిహారమైన సింగరేణి సంస్థను తొలుత నాలుగు బ్లాకుల వేలంతో మొదలు పెట్టి క్రమేపీ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుటిల ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వానికి పలుసార్లు లేఖ రాసినా, కేంద్ర బొగ్గ మంత్రిత్వ శాఖకు విన్నవించినా, పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసినా, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యం
ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ అంశంపై అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. సీసీఐని వెంటనే తెరిపించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నేటి నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు పార్లమెంట్ సభ్యులు సన్నద్ధమవుతున్నారు.