నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేడుకల్లో భాగంగా మూడోరోజైన గురువారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారు వేలాదిగా తరలివచ్చారు. స్వామి వారికి పసుపు కొమ్ములు, పాలు, పెరుగు, బెల్లంతో మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుల ఢమరుకాలు, శివసత్తుల పూనకాలు, యాదవుల సంప్రదాయ వేషధారణ జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సోన్, ఫిబ్రవరి 17 : నిర్మల్ మండలం ముజ్గి మల్లన్న జాతర వైభవంగా సాగుతున్నది. గురువారం నిర్వహించిన మల్లన్నస్వామి రథోత్సవానికి నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు మూడు గంటల పాటు రథోత్సవం కొనసాగింది. ఢమరుక నాదాలు, శివసత్తుల పూనకాలు, యాదవుల వేషధారణ జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథోత్సవం చుట్టూ వేలాది మంది భక్తులు మల్లన్న పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు గొర్రె, మేక పిల్లలు, పసుపు కొమ్ములు, పాలు, పెరుగు, బెల్లంతో మొక్కులు చెల్లించుకున్నారు. సోన్, నిర్మల్ రూరల్ సీఐలు రాంనర్సింహారెడ్డి, వెంకటేశ్, ఎస్ఐలు వినయ్‌కుమార్, కృష్ణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో యాదవ భక్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ వద్ద పిల్లల సందడి కనిపించింది.