ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 16 : ఆయనో గిరిజన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కానీ పిల్లలకు చదువు చెప్పేంత తీరికలేదేమో తనకంటూ ఓ సహాయకుడిని వలంటీర్‌గా పెట్టుకున్నాడు. వలంటీర్తోనే పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం నాలుగేండ్లుగా సాగుతున్నది. ఆదిలాబాద్ మండలం అంకాపూర్ గ్రామ పరిధి గుండంలొద్దిలోని టీడబ్ల్యూపీఎస్ (గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల)లో ఉపాధ్యాయుడి వైఖరితో విద్యార్థులకు నష్టం వాటిల్లుతున్నది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5 తరగతుల వరకు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయుడు 15 రోజులకు ఒకసారి మాత్రమే వస్తుంటాడని, అతనే నెలకు రూ.5 వేల ఇస్తూ ఓ వలంటీర్‌ను నియమించుకున్నాడని గిరిజనులు పేర్కొంటున్నారు. విధులకు హాజరైనా మద్యం మత్తులో ఉంటున్నాడని విద్యార్థుల తలిదండ్రులు చెబుతున్నారు. ఐటీడీఏ నుంచి వచ్చే బ్యాగులు, దుస్తులు, పుస్తకాలు కూడా సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందించడం లేదు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిందే..
సర్కారు గిరిజన విద్యాభివృద్ధికి ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి ఉపాధ్యాయుడి మూలంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. తమ పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నా ఉపాధ్యాయుడి మూలంగా నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ బడి తీరుపై దృష్టి సారిస్తే పేద గిరిజనులకు న్యాయం చేసినవారవుతారు.
మా గిరిజన గ్రామ బడికి సారు ఎప్పుడు వచ్చినా మద్యం మత్తులోనే కనిపిస్తడు. నేను ఇంటర్ పూర్తి చేశాను. గతంలో ప్యూర్ సంస్థ వారు నన్ను ఇక్కడ వలంటీర్‌గా నియమించారు. తర్వాత సార్ నెలనెలా నాకు రూ.5వేలు ఇస్తున్నడు. సార్ మాత్రం నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటూ మా పిల్లలకు అన్యాయం చేస్తున్నడని అనిపిస్తున్నది. నన్ను వలంటీర్‌గా తీనేసినా పర్వాలేదు.. కానీ సార్ మాత్రం రోజూ బడికి వచ్చి పాఠాలు చెప్పాలె.
-సిడాం అనిల్, ప్రైవేట్ వలంటీర్, గుండంలొద్ది
నాలుగేండ్లు ఇదే తంతు. మా బడి సారు రామారావ్ ఇటు దిక్కే సూడడు. ఎప్పుడు వచ్చినా మద్యం మత్తులో సోయిలేకుండా కనిపిస్తడు. గిరిజనుల పిల్లలకు సర్కారు ఎంతో చేస్తున్నది. కానీ మా సారు అసోంటోళ్లతోని సదువు అందడం లేదు. ఇప్పటికైనా పెద్దసార్లు ఈ బడికి వచ్చి చర్యలు తీసుకోవాలి. -ఆత్రం జంగుబాయి, గ్రామస్తురాలు
గుడంలొద్ది పాఠశాలలో ఉపాధ్యాయుడి తీరుపై గ్రామస్తులు ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు లేకున్నా మేము తనిఖీలు చేసి విచారణ చేపడుతాం. పీవో దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం సర్కారు బడుల్లో మెరుగైన విద్యను అందిస్తున్నది. ఎక్కడైనా ఉపాధ్యాయులు బోధనపై నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటాం.
-ఏ జగన్, ఏసీఎంవో, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, ఆదిలాబాద్