ఎదులాపురం, ఫిబ్రవరి 16 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్‌తో కలిసి అధికారులతో ‘మన ఊరు-మన బడి’ అమలుపై జిల్లా స్థాయి అవగామన సద్సు నిర్వహించారు. జిల్లాలోని 678 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని 60,485 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యంతో 466 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 107 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.
మొదటి విడుత మన ఊరు- మన బడి’ కింద 2021-22లో 142 ప్రాథమిక, 38 ప్రాథమికోన్నత, 57 ఉన్నత పాఠశాలలు మొత్తంగా 237(35 శాతం) ఎంపిక చేసినట్లు చెప్పారు. మొదటి దశ కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తూ విద్యా వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అమలుచేయాలన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని హంగులు సమకూరుస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కార్యక్రమంపై మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, అమలుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్, డీఈవో ప్రణీత, జీడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, జడ్పీటీసీ తాటిపెళ్లి రాజు, కుమ్ర సుధాకర్, గోక గణేశ్ రెడ్డి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషాతో కలిసి కలెక్టర్ ప్రత్యేక అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో దళితబంధు అమలుపై సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో దళితబంధు అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు, ఎమ్మెల్యేల నుంచి 100 మంది చొప్పున లబ్ధిదారుల జాబితాలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రత్యేక అధికారులు కిషన్, గణపతి, రవీందర్ రాథోడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం విద్యా, ఎస్సీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 5745 మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1761 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. మిగతా వారు రెండు, మూడు రోజుల్లోగా దరఖాస్తు చేసుకునేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేపటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ప్రతిరోజూ ఉపకార వేతనాలకు సంబంధించి సమీక్షించుకోవాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి భగత్ సునీత, డీఆర్డీవో కిషన్ తదితరులు ఉన్నారు.
ఆరోగ్య సమాచారం ఆశా యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆశ కార్యకర్తలకు సూచించారు. శాంతినగర్ యూపీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. రోగ్య శాఖ ద్వారా చేస్తున్న సర్వే వివరాలు, ఎన్సీడీ, ఏఎన్సీ, టీబీ, ఫీవర్ సర్వే తదితరాల వివరాలను ఆశా యాప్‌లో అప్లోడ్ చేసుకునే వీలుకలుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మందికి పైగా ఆశ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మెడికల్ ఆఫీసర్లు వినోద్ కుమార్, శ్రీకాంత్, ఆశ కార్యకర్తల జిల్లా కో ఆర్టినేటర్ అనిల్ కుమార్, వార్డు కౌన్సిలర్ శ్రీలత, నాయకులు జాఫర్ హైమద్, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.