నిర్మల్ చైన్‌గేట్, మార్చి 5: దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని, వారి జీవితాల్లో చిరుకాంతులు నింపుతున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల ఎంపికపై శనివారం నిర్వహించిన శిబిరానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్‌ను రూ.3016కు పెంచిందని గుర్తు చేశారు. మానసిక వైకల్యం, బుద్ధి మాంధ్యం ఉన్న పిల్లలకు ప్రభుత్వమే సదరమ్ శిబిరాలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నదని పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్లను అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నడవలేని, వినికిడి లోపం ఉన్నవారికి ఉపకరణాలను అందిస్తామన్నారు. బ్యాటరీ సైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ట్రైసైకిళ్లను అందించేందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీపీఆర్వో ఉమారాణి, దివ్యాంగుల సంఘం నాయకులు సట్టి సాయన్న, ఇసాక్, సురేందర్, కౌన్సిలర్లు సలీం, నరేందర్, తాజొద్దీన్, అధికారులు దేవీ మురళి, సగ్గం రాజు, సాగర్, శ్రీరాం రామ్మూర్తి, ఎజాజ్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మార్చి 5 : విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గాజులపేట్ బ్లూస్టార్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్‌కు హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు.విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ప్రయోగాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయంపై చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థినికి మంత్రి బహుమతి ప్రదానం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు మాజీద్, ముజ్జు చాహుసఖ్, సలీం, నాయకులు రమేశ్, రవి, నర్సయ్య, ప్రధానోపాధ్యాయుడు ముజీద్ పాల్గొన్నారు.