బేల, మార్చి5 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి అన్నారు. బేలలోని జడ్పీటీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానను 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత బీజేపీ జిల్లా నాయకులిద్దరు తమ ప్రభుత్వమే ఇచ్చిందని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం మంజూరు చేసినా తదుపరి వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం నిరంతర ప్రక్రియలో భాగమని తెలిపారు. వైద్య పోస్టుల భర్తీ విషయమై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం బేలలోని డీసీసీబీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకు మేనేజర్‌తో పాత బకాయిల రికవరీ, కొత్త రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్‌ను సత్కరించారు. నాయకులు గంభీర్ ఠాక్రె, సతీశ్‌పవార్, తన్వీర్ ఖాన్, సంతోష్ బెదుల్కర్, విఠల్ రావుత్ పాల్గొన్నారు.