ఆదిలాబాద్ రూరల్/సిరికొండ, ఫిబ్రవరి 11: జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా సత్తాచాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆకాంక్షించారు. తలమడుగు మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మచ్చ మౌనిక, సిరికొండ మండలం పొన్న గ్రామంలోని యూపీఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషికేశ్ జిల్లా నుంచి జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ విద్యార్థులకు, గైడ్ టీచర్లు రామకృష్ణ, రమేశ్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రయోగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి రఘు రమణ, ప్రధానోపాధ్యాయులు రమేశ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రసూతి మరణాలు అరికట్టడానికి
జిల్లాలో ప్రసూతి మరణాలు అరికట్టడానికి వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వైద్యాధికారులు, ఏఎన్ఎంలకు ప్రసూతి మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది గర్భిణులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పౌష్టికాహారం, మందులు తీసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు హిమోగ్లోబిన్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్లు వారి పరిధిలోని గర్భిణులను స్వయంగా పర్యవేక్షించి ప్రసవానికి ముందే ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నత దవాఖానాలకు రెఫర్ చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ మాట్లాడుతూ ప్రసూతి మరణాలు అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని, మారుమూల గ్రామాల్లో ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తామన్నారు. రిమ్స్ హెచ్‌వోడీ డాక్టర్ పద్మిని మాట్లాడుతూ గర్భిణులు వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ప్రసుతి మరణాలు అరికట్టవచ్చన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ నవ్యసువిధ, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.