నిర్మల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని రైతులు వరి సాగు నుంచి ఇతర పంటల వైపు అడుగులు వేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో యాసంగి సీజన్‌కు గాను 96 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఈ యేడు ప్రభుత్వ సూచనల మేరకు కేవలం 40 నుంచి 45 వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించింది. దీంతో రైతులు వరి సాగు విషయంలో వెనుకడుగేశారు. కాగా బోరుబావులు, చెరువులు, కాలువలు, ఇతర సాగు నీటి సదుపాయం పుష్కలంగా ఉన్నప్పటికీ వరికి బదులు ఆరుతడి పంటలనే అత్యధికంగా సాగు చేశారు. ముఖ్యంగా బోరు బావుల కింద ఈ యాసంగి సీజన్లో 50శాతం వరకు వరి సాగు తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 10 వేల ఎకరాల వ్యవసాయ సాగు విస్తీర్ణం ఉండగా.. ప్రతి సంవత్సరం రెండో పంట కింద 2 లక్షల 30వేల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేస్తుంటారు. ఈ యేడు ఈ విస్తీర్ణం మరింత తగ్గనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని పంటలు కలిసి లక్షా 80వేల ఎకరాలు మాత్రమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో రైతులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపారు. మక్కజొన్న, నువ్వులు, శనగ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, తదితర పంటలను అధికంగా వేశారు. గతేడాది యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 45వేల ఎకరాల్లో మక్కజొన్నను సాగు చేయగా.. ఈ యేడు 60 నుంచి 65వేల ఎకరాల్లోనే వేశారు. నువ్వుల పంటను గతేడాది 18 వేల ఎకరాల్లో వేయగా ఇప్పుడు 27 నుంచి 30 వేల ఎకరాల్లో వేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు ప్రధానంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల పంటలైన శనగ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది 55 వేల ఎకరాల్లో ఈ పంటను వేయగా.. ఈ సారి 65 వేల ఎకరాల్లో వేశారు. వీటితో పాటు వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర పప్పు దినుసుల పంటలను గతేడాది కంటే అధికంగానే వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ యాసంగి సీజన్లో పండించే వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వరి వేయవద్దని సూచించింది. ఇందుకు అనుగుణంగానే రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను విశ్వసించారు. వరికి బదులుగా ప్రత్నామ్నాయ పంటలను సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్
నాకు 12 ఎకరాల భూమి ఉంది. మొత్తం భూమిలో శనగ పంటే వేశా. ప్రతి సంవత్సరం బోరుబావి కింద వరి పంట వేసేవాణ్ని. ఈ సారి కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనబోదని అధికారులు చెప్పారు. అందుకే బోరుబావి కింద కూడా శనగ పంటే వేశా. ఈ పంటకు వరితో పోలిస్తే నీటి తడులు తక్కువగా అవసరమవుతాయి. మార్కెట్లోనూ మంచి ధర వస్తుందని ఆశిస్తున్నా.
– అనిల్పటేల్, రైతు, కుభీర్