లక్ష్మణచాంద, నవంబర్ 29 : ఇటీవల మండలంలోని పార్పెల్లి గ్రామంలో జరిగిన హత్య సంచలనంగా మారింది. కాగా, నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన కుంచపు సాయన్న, అతని భార్య కుంచపు కళ, కుమారులు వెంకటరమణ, ఒక బాలుడు కలిసి ఇంటి ప్రహరీ విషయంలో శివరాత్రి లక్ష్మి, స్వప్న, మహేశ్‌తో పథకం ప్రకారం గొడవ పెట్టుకోవాలని భావించారు. అందులో భాగంగా శివరాత్రి మహేశ్‌ను బూతులు తిట్టారు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. పాత కక్షలను మనుసులో పెట్టుకొని శివరాత్రి మహేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం దగ్గరలోని మురుగు కాలువలోకి తోసి గొంతు నులిమి చంపారు. అనంతరం కుంచపు సాయన్న తన భార్య, పిల్లలతో కలిసి పారిపోయాడు. హత్యచేసి పరారీలో ఉన్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లు, ఒక పోకలు కట్‌చేసే కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ 302 ఆర్/డబ్ల్యూ, 34 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐ రాహుల్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.