శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టంగా మార్చిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాతో కలిసి బుధవారం పర్యటించారు. ఆరు పోలీస్ స్టేషన్లు, ఒక సీఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. దేశంలోనే మన పోలీసులు నంబర్ వన్‌గా నిలుస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ వచ్చాక ఏ ఒక్క అవాంఛనీయ ఘటన జరగలేదని, ప్రజల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని స్పష్టం చేశారు. రెండు మైనార్టీ గురుకులాలను ప్రారంభించడంతో పాటు ఇటీవల కూలిపోయిన అందవెల్లి బ్రిడ్జిని పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు కోనప్ప, సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్, ఎస్పీ ఉన్నారు
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కాగజ్‌నగర్ టౌన్/కాగజ్‌నగర్ రూరల్/ రెబ్బెన, నవంబర్ 16: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా మారిందని, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించారు. రూ. 12. 30 కోట్లతో 6 పోలీస్ స్టేషన్లు, ఒక సీఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. మొదట కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నంబర్ వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని, శాంతిభధ్రతలు లోపిస్తాయని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అనేవారని, తెలంగాణ సాధించిన తర్వాత ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరుగలేదన్నారు. ఒక్క కర్ఫ్యూ కూడా విధించలేదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇందు కోసం రూ. 600 కోట్లతో హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంతర నిఘా కోసం అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు గుర్తు చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి లోటు లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న చర్యల ప్రజా సంరక్షణ కోసమేనని స్పష్టం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలు బాగున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ – కాగజ్‌నగర్- బల్లార్ష మీదుగా మూడో రైల్వేట్రాక్‌ను వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెబ్బెన, వాంకిడి,పెంచికల్పేట్, చింతలమానేపల్లి,కౌటాల పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాజ్నగర్లోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు వడ్డించారు.
కాగజ్‌నగర్ మండలంలో చింతగూడ వద్ద రూ. 36 కోట్లతో నిర్మించిన రెండు మైనార్టీ బాలుర గురుకులాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో 214 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. లక్ష ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఇటీవల కూలిపోయిన అందవెల్లి వంతెనను పరిశీలించారు. కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) అచ్చేశ్వర్రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, సీఐలు అల్లం నరేందర్, బగ్గాని శ్రీనివాస్, పురుషోత్తం, ఎస్ఐలు భూమేశ్, దీకొండ రమేశ్, సీహెచ్ రమేశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రంగు మహేశ్ గౌడ్, సర్పంచ్‌లు బొమ్మినేని అహల్యాదేవి, పందిర్ల వినోద, చెన్న సోమశేఖర్, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, వోల్వోజి హరిత, సంగం శ్రీనివాస్, ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి, తదితరులు పాల్గొన్నారు.