బోథ్, ఫిబ్రవరి 27 : బోథ్ మార్కెట్ కమిటీ ఆదాయ లక్ష్యానికి చేరువలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజుల గడువు ఉండడంతో అధికారుల కృషితో అందుకునేలా కనిపిస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3.21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ.1.14 కోట్లు వసూలైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విధించిన లక్ష్యం రూ.3.46 కోట్లకు గాను జనవరి 31 వరకు రూ. 3.10 కోట్లు వసూలయ్యాయి. ఏఎంసీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు చేస్తున్న పత్తిపై వచ్చే ఫీజుతో పాటు వ్యాపారులు కొనుగులు చేస్తున్న (మద్దతు ధర కంటే అధికంగా ఉన్న సమయంలో) సోయా, కంది, శనగ, మక్క, తదితర పంటలపై వచ్చే మార్కెట్ కమిటీ ఫీజుతో ఆదాయం సమకూరుతున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దు ఘన్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుతో మార్కెట్ ఫీజు వసూలవుతున్నది. ప్రస్తుత చైర్మన్ దావుల భోజన్న, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాము, సూపర్వైజర్ గంగన్న, సిబ్బందితో కలిసి గ్రామాలను సందర్శించి ట్రేడర్ల వద్ద నుంచి రావాల్సిన మార్కెట్ ఫీజు వసూలు చేయిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద నిఘా పెంచి సరుకులకు ఫీజు చెల్లించేలా చూస్తున్నారు. అందరి కృషి ఫలితంగా బోథ్ మార్కెట్ కమిటీ ఆదాయం లక్ష్యానికి దగ్గరలో ఉంది. మరో నెల మిగిలి ఉండడంతో రూ. 3.46 కోట్లు దాటేలా కనిపిస్తున్నది.
గ్రామాల్లో వ్యాపారులు, ట్రేడర్లు కొనుగోలు చేసే సరుకులపై మార్కెట్ ఫీజు వసూలు చేయిస్తున్నాం. ఏఏ సరుకులపై ఫీజు చెల్లించాల్సి ఉందో వాటిపై వసూలు చేపడుతున్నాం. పంటల దిగుబడులు ఈ సంవత్సరం తగ్గినా మార్కెట్లో అత్యధిక ధరలు పలుకుతుండడంతో భారీగానే ఫీజు వసూలవుతున్నది.
-దావుల భోజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్, బోథ్
ఇతర ప్రాంతాలకు తరలుతున్న పంట ఉత్పత్తుల వాహనాలపై నిఘా ఏర్పాటు చేశాం. సోయా, కందులు, పత్తి వాహనాలు మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లితే నిబంధనల మేరకు మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నాం. మార్కెట్ కమిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు మూలంగా ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలుతో ఆదాయం వస్తున్నది. లక్ష్యం చేరుకుంటామనే నమ్మకం కలుగుతున్నది.
-ఎస్ రాము, మార్కెట్ కమిటీ కార్యదర్శి బోథ్