ఆదిలాబాద్, మార్చి5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆడపిల్లలు పట్టుదలతో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఏ.శైలజ అన్నారు. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని, చదువులు, వివిధ పోటీ పరీక్షలు, స్వయం ఉపాధి లాంటి పనులు తమతో కావనే నిరుత్సాహాన్ని వీడాలన్నారు. సమస్యలను సాకుగా చూపకుండా వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినుల ఉన్నత చదువులు, ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, రక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు. తాను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని పట్టుదలతో మూడు ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. తమ సొంతూరు నిర్మల్ అని, ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడ పూర్తిచేసి, ఆదిలాబాద్లో టీటీసీ చదివి 1998లో 19 ఏళ్ల వయస్సులోనే ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించానని తెలిపారు. అనంతరం బీఎడ్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్-2లో మహిళల విభాగంలో రెండో ర్యాంకు సంపాదించినట్లు పేర్కొన్నారు. 2009లో గ్రూప్-2 ఉద్యోగం వచ్చినా చేరలేదని, మరోసారి 2011లో గ్రూప్-2 పరీక్ష రాసి మున్సిపల్ కమిషనర్గా ఉద్యోగం సంపాదించినట్లు చెప్పారు. భైంసా, మెట్పల్లి, ఆర్మూర్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేశానన్నారు.
గతంలో ఆడపిల్లలు చదువుకునేందుకు సరైన సౌకర్యాలు, కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం ఉండేది కాదని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థినులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తన భర్త గజేందర్ నిర్మల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారని, మొదటి కుమారుడు కేరళ ఐఐటీలో చివరి సంవత్సరం చదువుతున్నారని, రెండో కొడుకు బీఎంఎల్టీ చదువుతున్నట్లు చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టం అధికారులు, సిబ్బందితోపాటు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలిపారు.