సిరికొండ, మార్చి 5 : అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎంపీపీ పెందూర్ అమృత్‌రావ్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ప్రజాప్రతినిధులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, కొంతమంది టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, మిషన్ భగరీథ నీరు అందించక పోవడంతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ ఆఫీసర్ శ్యాం మాట్లాడుతూ త్వరలో ఇంటింటికీ హెల్త్‌సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఎండకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. సమావేశానికి రాని అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ తెలిపారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ సాగరిక, ఎంపీడీవో సురేశ్, ఐకేపీ ఏపీవో సంతోష్, డిప్యూటీ అటవీశాఖాధికారి గిరయ్య, ఎంపీవో భీంరావ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.