ఎదులాపురం, మార్చి 5 : వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేయవద్దని సీఐ చంద్రమౌళి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శనివారం విద్యార్థినులకు బాల్యవివాహాలు, గృహహింస, లైంగిక వేధింపులను కట్టడి చేయడానికి అవగాహన కల్పించారు. బాలికల భద్రత కోసం సూచనలు చేస్తున్న పలు పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోకుండా జిల్లా అంతటా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఏ సందర్భంలో అయినా బాధితులకు ఫిర్యాదు చేయడానికి డయల్ 100 వజ్రాయుధమని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు 24 గంటల్లో టోల్ ఫ్రీ నంబర్ 155260కు ఫోన్ చేసి వివరాలు తెలియజేసినచో పోయిన నగదు రాబట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేశ్, దారట్ల రమేశ్, హనుమంతరావు పాల్గొన్నారు.