సోన్, మార్చి 3 : వరికి బదులు ఇంతర పంటలు సాగు చేయాలన్న రాష్ట్ర సర్కారు సూచనల మేరకు నిర్మల్ జిల్లా రైతులు ఆవాలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు నేరుగా ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామంటూ ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిర్మల్, కుంటాల, లోకేశ్వరం, సారంగాపూర్, మామడ, సోన్, తదితర మండలాల్లో 5 వేల ఎకరాలకు పైగా ఆవాలు సాగు చేస్తున్నారు. ఈ పంట 85 నుంచి 90 రోజుల మధ్య చేతికి వస్తుంది. అంటే ఫిబ్రవరి మొదటి వారంలో కోయవచ్చు. ఆ తర్వాత మూడో పంటగా నువ్వులు సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపారు. ఆవాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాలుకు బహిరంగ మార్కెట్లో రూ. 6 నుంచి రూ.7 వేల దాకా ధర పలుకుతుంది. ఎకరానికి 5 నుంచి 6వేల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా ఆదాయం పొందవచ్చు. కేవలం రూ. 5 వేల పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే వీలున్నది.
నిర్మల్ జిల్లాలో ఆయా మండలాల్లో ఈ యాసంగి సీజన్లో రైతులు హైబ్రిడ్ రకంతో పాటు సాధారణ రకాల ఆవాలను సాగు చేయడంతో ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మార్కెట్లో ఆవాలకు మంచి డిమాండ్ ఉండడం, వినియోగం కంటే తక్కువగా పంట సాగు చేస్తుండడంతో రైతుల వద్దకు వచ్చి ఆవాలను తమకే విక్రయించాలని కోరుతున్నారు. ఇప్పటికే నిర్మల్, కుంటాల, సారంగాపూర్, సోన్, మామడ, తదితర మండలాల్లో ప్రైవేట్ సీడ్ కంపెనీల సిబ్బంది ఆవాలను సాగు చేస్తున్న రైతుల వివరాలు తెలుసుకొని రూ.7 వేలకు కొనుగోలు చేస్తామని ఒప్పంద పత్రాలను రాయించుకుంటున్నారు. నాణ్యత లోపిస్తే రూ.6,500 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తామని రైతులకు చెప్పుతుండడంతో రైతులు మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇది వరకు ఆవాలు విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో నిజామాబాద్, ధర్మాబాద్, భోకర్, భైంసా మార్కెట్లకు వెళ్లాల్సి వచ్చేది. దీనికితోడు రవాణా చార్జీలు కూడా తడిసిభారమయ్యేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
నాకు మా ఊరిలో ఐదెకరాల భూమి ఉంది. 20 ఏండ్లుగా ఎవుసం చేస్తున్నా. రకరకాల పంటలు వేసి నష్టపోయిన. పెట్టిన పెట్టుబడి సైతం రాక ఇబ్బందులు పడేది. రెండేండ్ల నుంచి యాసంగిలో ఆవాలు సాగు చేస్తున్న. ఎకరం ఆవాల సాగుకు విత్తనాలు మొదలుకొని పంట చేతికొచ్చే వరకు రూ. 10వేలు ఖర్చు అవుతోంది. నేను 20 గుంటల్లో కిలోన్నర ఆవాల విత్తనాలు వేసిన. ఇందుకు రూ. 750 అయినయ్. పెట్టుబడికి మొత్తం రూ.5 వేలు అయినయ్. అర ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నా. ఎకరానికి రూ. 7 వేల ధర ఇస్తామన్నారు. – నారుపల్లి నర్సారెడ్డి, చిట్యాల్