ఎదులాపురం, ఫిబ్రవరి3: సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం సకాలంలో నిర్వహించాలని, వచ్చే సమావేశం నాటికి కొత్త ప్రతిపాదనలతో అధికారులు ముందుకు రావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సఖీ వన్ స్టాప్ కేంద్రం మరింత కొత్తదనంతో బాధితులకు స్వాంతన చేకూర్చే విధంగా , సకాలంలో పరిహారంఅందించడం, కేసుల నమోదు, పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ వేళ బాధితులకు సత్వర వైద్య సదుపాయాలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఫెసిలిటేషన్ అధికారిని త్వరగా నియమించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సఖీ కేంద్రం కొత్త భవనాన్ని త్వరలో ప్రారంభించుకొని కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. బాధిత పిల్లలకు కేజీబీవీలో వసతి సౌకర్యం కల్పించాలని డీఈవోను ఆదేశించారు.
సఖీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలను జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలో గత మార్చి నుంచి ఇప్పటి వరకు 271 కేసులు నమోదయ్యాయని, 76 మంది బాధితులకు రూ.20.60 లక్షల పరిహారం అందించినట్లు చెప్పారు. 395 మందికి కౌన్సెలింగ్, 45 మందికి వసతి, 136 మంది న్యాయ సేవలు, 43 మందికి వైద్య సహకారం, 41 మందికి పోలీస్ సహకారం అందించినట్లు వెల్లడించారు.జిల్లాలో 304 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. న్యాయ సేవా సహకార సంస్థ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయ సహాయం అందిస్తున్నామని, కేసు ఫైల్ చేసిన రోజే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే తెలిపారు. పంచాయతీలు, దండారీ, ఇతర కార్యక్రమాల్లో తదితర సఖీ సేవలపై అవగాహన కల్పించామని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా తెలిపారు. 26 గృహహింస కేసులు వివిధ కోర్టుల్లో ఫైల్ చేసినట్లు వివరించారు. ఈ వర్చువల్ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్‌రావు, డీఈవోప్రణీత, డీపీఆర్వో ఎన్ భీమ్ కుమార్, డాక్టర్ నవ్య, కమిటీ సభ్యురాలు ఝాన్సీ, సఖీ కేంద్ర నిర్వహకురాలు పవర్ యశోద పాల్గొన్నారు.
పెండింగ్ అడిట్ పేరాలకు సవివరమైన నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా స్థాయి అడిట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్థానిక సంస్థల కార్యాలయాల తనిఖీ సందర్భంలో అడిట్ పార్టీ తెలిపిన అభ్యంతర పేరాలకు సమాధానాలు అందించాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే సందర్భంలో పెండింగ్ అడిట్ పేరాలపై చర్చించనున్నారని, వాటిని సరిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 2005-06 నుంచి 2020-21 వరకు జిల్లాలో 70,140 పేరాలకు సుమారు రూ.292.23 నిధులకు అడిట్ అధికారులు అభ్యంతరాలు తెలిపారన్నారు. అడిట్ నివేదిక అందిన 60 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా పరిషత్ 970 పేరాలకు రూ. 143 కోట్లు, మండల పరిషత్ 2,122 పేరాలకు రూ.6.50 కోట్లు, జీపీలు 65.004 పేరాలకు రూ.29.71 కోట్లు, మున్సిపల్ కౌన్సిల్ 703 పేరాలకు రూ.54.81కోట్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ 1012 పేరాలకు రూ. 57.17 కోట్లు, దేవాదాయ శాఖ 260 పేరాలకు రూ.8.47 కోట్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ 69 పేరాలకు రూ.1.33 కోట్లు తెలిపిన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందని జిల్లా అడిట్ అధికారి కే రాజ్‌కుమార్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పేరాలలో ఆర్థిక, ఆర్థికేతర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనిఖీ సమయంలో ఆఫ్ మార్జిన్ నివేదికలకు కూడా అధికారులు సమాధానాలు సమర్పించడం లేదని సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా పంచాయతీ అధికారి పీ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.