ఎదులాపురం,మార్చి1: వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉన్న వారికి రాష్ట్ర పోలీస్‌శాఖ భారీ ఊరటనిచ్చింది. ఆయా వాహనాలపై ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం రాయితీతో చెల్లించే అవకాశాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. డిస్కౌంట్‌తో చెల్లింపు ఈ నెల ఒకటో తేదీన అమలులోకి వచ్చిందని, 31 వరకు అవకాశం ఉందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్‌రెడ్డి తెలిపారు. https:// echallan.tspolice.gov.in ద్వారా చెల్లించవచ్చని వివరించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఉల్లంఘనులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధించిగా, వారు కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2019 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు 4,55,776 కేసులు నమోదయ్యాయి. వీటికి రూ.15.49 కోట్లపైగా చలాన్ల బకాయిలు వసూలు కావల్సి ఉన్నదని పోలీసులు తెలిపారు.
ద్వి,త్రి చక్ర వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ డ్రై వర్లకు 70 శాతం, లైట్, హెవీ మోటర్ వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం, నో మాస్క్‌కు 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు.