నిర్మల్ అర్బన్, మార్చి 1 : నిర్మల్ పట్టణ అంతర్గత రోడ్డు పనులకు మహర్ధశ చేకూరనుంది. ఇరుకు రోడ్డుతోఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు విస్తరణ పనులను చేయించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా నిత్యం పర్యటిస్తూ అబివృద్ధి పనులను దగ్గరుండి పూర్తి చేయించారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఇండ్లు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో పట్టణ ప్రజలు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకుండా స్వచ్ఛందంగా సహకరించారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చివరి దశలో ఉండండతో చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు రూ.5 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడంతో డబుల్లేన్తో బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తుండడం,వాటి అనంతరం రూ. 2 కోట్ల నిధులతో పలు చోట్ల 16 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడు తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు మొత్తం రూ.5 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులను పూర్తి చేయనున్నారు. మొదట రూ.2 కోట్లతో చైన్‌గేట్ నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరలోని పోస్టాఫీస్ వరకు మొదటి విడుతలో పనులు పూర్తి చేయనున్నారు. రెండో విడుతలో పోస్టాఫీస్ నుంచి బంగల్పేట్ వరకు రూ.మరో 3 కోట్లతో పనులను పూర్తి చేయనున్నారు. మొత్తం 1.60 కిలో మీటర్ల దూరం మేరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రెండు లేన్ల బీటీ రోడ్డు నిర్మించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం, మున్సిపల్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు.
నిర్మల్ జిల్లా ఏర్పాటు కావడంతో పట్టణ జనాభా రోజు రోజుకూ పెరుగుతున్నది. జనాభాకు అనుగుణంగా అంతర్గత రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో ఇరుకు రోడ్లలో ప్రయాణం చేయడం, ఒకే సారి రెండు వాహనాలు పక్కపక్కన వెళ్లడానికి అనేక ఇబ్బందులు గురయ్యేవి. దీర్ఘకాలిక సమస్యను తొలగించడానికి రోడ్డు విస్తరణే మార్గం అనిపించడంతోఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యను దూరం చేశారు. సమస్యను దూరం కావడంతో పాటు పట్టణంలోని 16 చోట్ల రూ.2 కోట్ల నిధులతో హైమస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తుండడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంతో పాటు నియో జక వర్గ అభివృద్ధికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారు. రూ. కోట్లతతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా అంతర్గత రోడ్డు అభివృద్ధి పనులకు ఏ నాయకుడూ సాహసించలేరు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజల ఇబ్బందులను గుర్తించి అభివృద్ధి పనులను చేయిస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే నిర్మల్ మోడల్ మున్సిపాలిటీగా మారనుంది.
గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్