నిర్మల్‌టౌన్, మార్చి 1: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందున్నది. వ్యవసాయ శాఖ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలుపై రోజువారీగా ఆన్లైన్ చేస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల పనితీరును ప్రామాణికంగా తీసుకొని గ్రేడింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల పనితీరును పరిశీలించిం, ర్యాంకులు కేటాయించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలకు 79.2 తో మొదటి స్థానం దక్కగా, నిర్మల్ 74.08 తో మూడో స్థానంలో నిలిచింది. ఆదివాసీ జిల్లాగా పేరొందిన కుమ్రం భీం ఆసిఫాబాద్ 31.09 తో చివరి స్థానంలో ఉండగా, ఆదిలాబాద్ 48.08 తో 31వ స్థానంలో ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, పీఎమ్ కిసాన్ నిధి నమోదు, క్రాప్ బుకింగ్, విత్తనాలు, ఎరువుల దుకాణాల తనిఖీలు, నమూనాల సేకరణ ప్రామాణికంగా వ్యవసాయశాఖ గ్రేడింగ్ నిర్వహిస్తున్నది. మొత్తం 4 గ్రేడ్లుగా విభజించారు. ఏ1 గ్రేడింగ్ కింద క్రాప్ బుకింగ్, ఏ2 కింద పీఎం కిసాన్ నిధి, ఏ3 కింద రైతుబీమా, ఏ4 కింద క్వాలిటీ కంట్రోల్ వివిధ విభాగాలను నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఉన్న ఏఈవోల పనితీరుతో పాటు ఏడీఏలు, ఏడీల సమక్షంలో వ్యవసాయ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. పనితీరు ప్రామాణికంగా నిర్వహిస్తున్న గ్రేడింగ్‌తో రైతుల కోసం చేపట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో త్వరతిగతిన చేరేందుకు అవకాశం కలగనుంది. వెనుకబడిన జిల్లాలపై ఈ గ్రేడింగ్ ప్రత్యేక దృష్టి పెట్టనున్న నేపథ్యంలోప్రభుత్వ రైతు లక్ష్యాలు మరింత చేరువ కానున్నాయి.
వ్యవసాయ శాఖ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పథకాలు పథకాలు, అధికారుల పనితీరు ప్రామాణికంగా నిర్వహించే గ్రేడింగ్‌లో సమష్టి కృషితోనే సత్ఫలితాలు సాధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతుబీమా, క్రాప్ బుకింగ్ అవసరమైన ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవిగా అందిస్తున్నది. ఏరోజుకారోజు రైతులకు ఈ పథకాలు క్షేత్ర స్థాయిలో అందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్రేడింగ్ చేపట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రేడింగ్ వల్ల అధికారుల్లో అలసత్వం తొలగి మరింత ప్రయోజనం కలుగనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందున్న నిర్మల్, మంచిర్యాలలో పనిచేసే అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. పారదర్శకంగా విధుల నిర్వహిస్తుండడంతో రెండు జిల్లాలకు రాష్ట్రంలోనే 1, 3 స్థానాలు దక్కాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో చివరి స్థానాల్లో ఉండడంపై అక్కడి అధికారుల పనితీరుపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తున్నది.
వ్యవసాయ శాఖ పనితీరుకు ప్రామాణికంగా నిర్వహిస్తున్న గ్రేడింగ్‌తో మంచిర్యాలకు మొదటి స్థానం, నిర్మల్‌కు మూడో స్థానం దక్కడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ధాన్యాగార, రైతు సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు కూడా అంకితభావంతో పనిచేసేందుకు ఈ ఈ విధానం ఉపయోగపడుతుంది. పథకాల అమలులో జాప్యం లేకుండా గ్రేడింగ్ విధానం వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలవనుండడంతో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.
అంజి ప్రసాద్, నిర్మల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో పారదర్శకంగా ఉండేందుకు గ్రేడింగ్ నిర్వహించడంతో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చి పంటలు సర్వే చేస్తున్నారు. ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే విషయాలు కచ్చితంగా తెలుస్తున్నాయి. పంట కొనుగోలు సమయంలో కూడా ఇబ్బందులు తప్పుతున్నాయి. రైతుబీమా, నాణ్యమైన విత్తనాలు అందించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటున్నందుకు రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంది.
దనగరి సంతోష్, రైతు, ఓల