Adilabad | ఆదిలాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు వెనుకబడిన జిల్లాగా పేరు ఉండేది. గత పాలకులు జిల్లా అభివృద్ధిని, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేళ్లుగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి పట్టణాలకు పరిమితమైన ఐటీ రంగం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ పాలసీ వల్ల ఆదిలాబాద్ జిల్లాకూ విస్తరించింది. దీంతో స్థానిక యువతకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు తమ సొంత ప్రాంతాల్లో లభిస్తున్నాయి. విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, సాగు, తాగునీరు, పరిశ్రమల ఏర్పాటు, పట్టణాలు, గ్రామాల్లో నివసించే ప్రజలకు అన్ని రకాల సొకర్యాలను ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రభుత్వం జోనల్ విధానం అమలు చేయడంతో నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు, చెక్ డ్యాం నిర్మాణం చేపట్టింది. ఫలితంగా గతంలో కంటే 1.20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా 219 చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం రూ. 201.48 కోట్లు ఖర్చు చేసింది. దీంతో 41 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. సాత్నాల ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలకు నీరు అందుతున్నది. మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగాపై రూ.1,596 కోట్లతో చేపట్టిన చనాక-కొరాట ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఐదు మండలాల్లోని 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
సాగునీటికి, భూగర్భ జలాలను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులను పునరుద్ధరించింది. జిల్లాలో 502 చెరువులకు గాను 372 చెరువులకు మరమ్మతులు చేసింది.ఫలితంగా దాదాపు 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.55 కోట్లు ఖర్చు చేసింది.
ధరణి సేవలు
భూ సమస్యలు గ్రామాల్లోని ప్రజల మధ్య కొట్లాటలకు దారితీసేవి. నిజాం కాలంలో తయారు చేసిన భూముల వివరాలు అస్తవ్యస్తంగా ఉండడంతో ఇందులోని లొసుగులను ఆధారం చేసుకొని కబ్జాదారులు అక్రమణలకు పాల్పడేవారు. దీంతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగేది. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి భూముల రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర భూముల వివరాలు తెలిశాయి. గతంలో రైతులు భూములు విక్రయించాలన్నా, కొనుగోలు చేయాలన్నా రెవెన్యూ పరమైన సమస్యలు ఎదుర్కొనే వారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత భూముల అమ్మకాలు, కొనుగోళ్లు సులభంగా మారాయి.
ఫలించిన భగీరథ మిషన్..
తండాలు, గూడేలు, పల్లెలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1,144 ఆవాసాలకు రూ.224 కోట్లు వెచ్చించింది. ఈ నిధులతో 907 ట్యాంకులు, 862 కిలోమీటర్ల పొడవు పైపులైన్ వేయడంతోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. 893 ట్యాంకులను పూర్తి చేయడంతో నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతున్నది.
ఇంటింటికీ నల్లా నీరు
మిషన్ భగీరథ పథకం ద్వారా సర్కారు ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నది. జిల్లాలో రూ.940 మంచినీటి ట్యాంకులు, 1,857 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేశారు. ఫలితంగా 1,144 గ్రామాల్లోని 1,50,290 కుటుంబాలకు నల్లానీరు అందుతున్నది. ఎండాకాలంలోనూ నీటి కొరత ఉండడం లేదు. రక్షితమైన నీటిని తాగి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.
Adilabad6
గర్భిణులు, బాలింతలకు వరంగా ఆరోగ్యలక్ష్మి
గతంలో జిల్లాలో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహరం సమస్యతో ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ భోజనం అందిస్తారు. ప్రతి రోజూ ఉడికించిన గుడ్డును పంపిణీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 11,866 మంది గర్భిణులు, బాలింతలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో అపరిశుభ్రమైన వాతావరణంతో ప్రజలు అరోగ్య, ఇతర సమస్యలు ఎదుర్కొనే వారు. ప్రభుత్వం గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడంతోపాటు పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంలో భాగంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీతోపాటు 468 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం విజయవంతమైంది. పచ్చదనంలో పల్లెలు కళకళలాడుతున్నాయి. పరిశుభ్రత కారణంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.
33 వంతెనలకు రూ.234.17 కోట్లు..
తొమ్మిదేండ్లలో 33 వంతెల నిర్మాణాలకు సుమారు రూ.234 కోట్లు కేటాయించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రూ.46.52 కోట్లతో 16 వంతెనలకు నిధులు వచ్చాయి. ఆసిఫాబాద్-ఉట్నూర్ ప్రధాన రహదారిపై సుమారు రూ.13.80 కోట్లతో తొమ్మిది వంతెనలు పూర్తయ్యాయి. సిర్పూర్-టి నియోజకవర్గంలో దాదాపు రూ.187.65 కోట్లతో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. గూడెం-అయిరి వద్ద తెలంగాణ-మహారాష్ట్రను కలిపే భారీ వంతెన రూ.65 కోట్లతో నిర్మిస్తున్నారు.
మారుమూల గ్రామాలకు రహదారులు
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పంచాయత్‌రాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులు నిర్మించారు. దాదాపు రూ.92 కోట్లతో 55 గ్రామాలకు రోడ్లు వచ్చాయి. వీటిలో 51 రోడ్లు పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గానికి పంచాయతీరాజ్ ద్వారా రూ.35 కోట్లు, ఐటీడీఏ ద్వారా రూ.10 కోట్లు, ఆర్అండ్బీ ద్వారా రూ.125 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 130 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తయ్యాయి.
పల్లెపల్లెకు రోడ్డు..
తెలంగాణ ప్రభుత్వం రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో రూ.450 కోట్లతో రహదారులు, వంతెన లను నిర్మించింది. దీంతో గ్రామాల్లోని ప్రజలు గంట వ్యవధిలో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం లభించింది.
మత్స్య సిరులు..
2016 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. మంచిర్యాల జిల్లాలో 108 ట్యాంకులు (చెరువుల్లో) 57.23 లక్షల ఉచిత చేప పిల్లలను వదలగా, ఈ ఏడాది 384 చెరువులు, నాలుగు రిజర్వాయర్లలో 2.20 కోట్ల చేప పిల్లలను వదిలారు. గతేడాది 371 చెరువుల్లో రెండు కోట్ల చేప పిల్లలు వేయగా, సుమారు ఏడు వేల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 67 సంఘాల్లో 4647 మంది సభ్యులుండగా, ప్రస్తుతం 114 సంఘాల్లో 6499 మంది ఉన్నారు. ప్రభుత్వం చేప పిల్లల పెంపకంతో పాటు వాటిని పట్టేందుకు వలలు, నిలువ చేసుకునేందుకు ఐస్ పెట్టలు, అమ్ముకునేందుకు స్టాళ్లు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు వాహనాలను సైతం అందిస్తున్నది.
నిరంతర వెలుగులు
జిల్లాలో వివిధ కేటగిరీల కింద 2,48,026 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అన్నింటికీ 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నది. వ్యవసాయ రంగానికి కూడా ఉచితంగా త్రీఫేజ్ కరంట్ అందిస్తున్నారు. దీంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. చిరువ్యాపారుల ఉపాధి కూడా మెరుగుపడింది.
కొత్త పాఠశాలలు-కళాశాలలు.
కొత్తగా 12 పాఠశాలలను ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో గిరిజన మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాల, ఒక అర్బన్ రెసిడెన్షి యల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడిన మూడు మండలాల్లో కేజీబీవీలను స్థాపించి విద్యావికాసానికి కృషి చేస్తున్నది. కార్పొరేట్ స్థాయి విద్య, సన్న బియ్యంతో రుచికరమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నది. ఆదర్శ డిగ్రీ కళాశాలను, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యా బోధన ఇంగ్లిష్ మీడియంలో అందించేలా అన్ని వసతులు కల్పిస్తున్నది.
అభివృద్ధి-సంక్షేమం రెండు కండ్లలా..
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో మౌలిక వసతుల కల్పనతోపాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామీణు ల జీవన ప్రమాణాల్లో మార్పులు తేవడంతోపాటు వారి ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. జిల్లాలో ప్రతి గడప కూ ప్రభుత్వ పథకాలు చేరాయి. రోడ్లు, వంతెనలు, పాఠశాల భవనాలను నిర్మించడంతోపాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నది.
ఐటీ పరిశ్రమలతో ఉపాధి
జిల్లాలో గతేడాది బీడీఎన్టీ ఐటీ పరిశ్రమ ప్రారంభం కాగా 130 మంది జిల్లా యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని బట్టిసావర్గాంలో మూడెకరాల్లో ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో వెయ్యి మందికి భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న జోనల్ విధానం ద్వారా జిల్లాలోని 1,200 మంది స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి.
Adilabad5
చేరువైన పాలన.. పూర్తికావొస్తున్న కలెక్టరేట్..
కొత్త జిల్లాతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రతి చిన్న పనికీ రూ.150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు పోయే గోస తప్పింది. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. రూ.52.20 కోట్లతో భారీ భవంతి రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన పనులు 100 శాతం పూర్తయ్యాయి. రూ.7 కోట్లు విలువ చేసే ఎలక్ట్రికల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంచిర్యాల- చెన్నూరు రహదారి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లేరోడ్డు, కలెక్టరేట్ లోపల రోడ్ల పనులు చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే దాదాపు 35 నుంచి 37 ప్రభుత్వ శాఖలన్నీ ఒకే దగ్గరకు వస్తాయి. అధికారులందరూ ఒకే దగ్గర అందుబాటులో ఉంటారు. ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, అధునాతన వసతి గృహాలతో కొత్త కలెక్టరేట్ ముస్తాబు
అవుతున్నది.
కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణం..
ప్రభుత్వం జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేస్తునది. కలెక్టర్ కార్యాలయాన్ని రూ.54కోట్లతో చేపట్టగా నిర్మాణం పూర్తి కావచ్చింది. ఎస్పీ కార్యాలయాన్ని రూ.10.50 కోట్లతో నిర్మాణం పూర్తయింది.
ప్రజల ముంగిట వైద్యసేవలు
ఆదిలాబాద్‌లో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించడంతోపాటు 22 పీహెచ్‌సీలు, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్‌లో వైద్యులు, సిబ్బంది, అన్ని రకాల వ్యాధులకు మందులను అందుబాటులో పెట్టింది. గతంలో గర్భిణులు ప్రసవాలకు పట్టణ ప్రాంతాలకు వెళ్లి భారీగా డబ్బు ఖర్చు సేవారు. ఇప్పడు పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలో నరాలు, గుండె, చిన్న పిల్లలు, కండ్ల సమస్యల లాంటి వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు.
జోడేఘాట్‌కు గుర్తింపు
సమైక్యపాలనలో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన జోడేఘాట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధి బాట పట్టింది. 2014లో జోడేఘాట్‌లో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి జోడేఘాట్ రూపురేఖలను మార్చేశారు. రూ.25 కోట్లతో కుమ్రం భీం స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియం, స్మృతివనంతోపాటు రూ.15 కోట్లతో హట్టి నుంచి జోడేఘాట్‌కు రెండు వరుసల రోడ్డు వేయించారు.