ఆదిలాబాద్, నవంబరు 29 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో ధూసుకుపోతుంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం తొమ్మిదిన్నర ఏండ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. రూ. 5, 250 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజలు జీవణప్రమాణాలు మెరుగుపడ్డాయి.
సాగునీటి రంగానికి పెద్దపీట
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలంం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనాక, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. నియోజకవర్గంలో నిర్మించిన మిషన్ కాకతీయలో భాగంగా నిర్మించిన చెరువుల ఫలితంగా రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మాణంతో భూగర్భజల నీటమట్టం గణనీయంగా పెరిగింది.
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందన్నాయి. ఆరోగ్య సమస్యలతో వచ్చేవారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రభుత్వ టీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసి 57 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. రూ.150 కోట్లతో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించారు. కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, సర్జికల్ అంకాజి, పీడీయాట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేదలకు ఉచితంగా కీళ్లమార్పడి చికిత్సలు చేస్తున్నారు. రూ.1.56కోట్లతో బేల పీహెచ్సీ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా, రూ.20లక్షల చొప్పున ఆరు సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.1.20కోట్ల మంజూరయ్యాయి.
విద్యారంగంలో ప్రగతి
నియోజకవర్గంలో విద్యార్థులకు ఉన్నత చదువులు అందుబాటులోకి ప్రభుత్వం అగ్రికల్చర్, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేసింది. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా మొదటి విడుతలో రూ.20కోట్ల నిధులు ఆదిలాబాద్ నియోజక వర్గంలో 78 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మంజూరు చేశారు. పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందించడానికి బేలలో బీసీ బాలుర గురుకుల పాఠశాల ప్రారంభించారు.
మెరుగైన రవాణా సౌకర్యం
నియోజకవర్గంలో రూ. వేయి కోట్లతో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి వెచ్చించారు. రూ.45కోట్లతో ఆదిలాబాద్ నుంచి బేల వరకు రెండు వరుసల రహదారి నిర్మించారు. ఆదిలాబాద్‌లో రూ.63.29 కోట్లు రోడ్లు విస్తరణ పనుల, సీసీ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం కేటాయించారు. రూ.10 కోట్లతో ఆదిలాబాద్ నుంచి కెరమెరి రోడ్డు రహదారిపై మూడు వంతెనలు నిర్మించారు. జామిని నుంచి పెన్ గంగ రోడ్డును వెడల్పు చేయడానికి రూ.10కోట్లు కేటాయించారు. బేల, ఆదిలాబాద్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, వెడల్పు కోసం రూ.4.30కోట్లు మంజూరు చేశారు. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి , అండర్ బ్రిడ్జిల కోసం రూ.87.20కోట్లతో పనులు సాగుతున్నాయి.
యువతకు ఉపాధి
నియోజకవర్గంలోని యువత ఉపాధి కల్పనకు జిల్లాలో రెండు ఐటీ కంపెనీలు ఉండగా 230 మందిఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.40 కోట్లతో మూడు ఎకరాల్లో ఐటీ టవర్‌ను ప్రభుత్వం నిర్మిస్తుంది. టవర్ నిర్మాణంతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
యువత ఉపాధి కోసం ప్రత్యేక ప్యాకేజీ
ఆదిలాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదిన్నర ఏండ్లలో రూ. 5250 కోట్లు వ్యయం చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. పట్టణాలకు పరిమితమైన ఐటీ రంగం ఇప్పుడు ఆదిలాబాద్‌కు విస్తరించింది. ప్రభుత్వం రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మిస్తుంది. గతంలో ఎన్నడూ చేపట్టని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగింది. వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, మహిళా సంక్షేమ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, కులవృత్తులకు చేయూత అందిస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కల్పంచడానికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.
-జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్