జైనథ్(బేల), నవంబర్ 14 : గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం బేల మండలంలోని ఖడ్కి, సోన్ఖాస్, సదల్పూర్, వరూర్, హస్నాపూర్, పోహార్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో జోగు రామన్నకు ఘన స్వాగతం పలుకుతూ వీర తిలకం దిద్దుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం అసువులు బాసిన ఆదివాసీ గిరిజన ఆరాద్య దైవం కుమ్రం భీం మ్యూజియంను రూ.25 వేల కోట్లతో నిర్మించామన్నారు. గిరిజన పండుగలను అధికారికంగా జరుపుతున్నామన్నారు. వారి పండుగలకు ప్రోత్సహిస్తామన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చామన్నారు. బేల మండలంలోని అతిపూరాతనమైన బైరందేవ్ శివాలయ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చమని తెలిపారు. దీంతో పాటు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో పాటు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ లు మోసం చేశాయి
దేశాన్ని 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేశాయన్నారు. జన్‌ధన్ పేరిట మహిళల అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ మహిళలకు రూపాయి వేయకుండా మోసం చేశారన్నారు. ఏడాదికి రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. 3 గంటల కరెంట్ రైతులకు సరిపోతుందని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడి వ్యాఖ్యలకు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన పథకాలు అమలవుతాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, ఎంపీపీ వనితాగంభీర్ ఠాక్రే, జడ్పీటీసీ సతీశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జక్కుల మధుకర్, నాయకులు దేవన్న, సుదర్శన్, సునీత, మస్కే తేజ్రావ్, కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.