ఎదులాపురం, నవంబర్ 8 : అసమర్థ పాలనకు కర్ణాటక రాష్ట్రమే నిదర్శనమని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బుధువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకుడు జబాడే దళిత్ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు, అలాగే అంబేద్కర్ నగర్‌కు చెందిన మహిళలు, యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ 65 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో విఫలమైందన్నారు.
ఆ పార్టీ నేతలు అబద్దపు మాటలు మాట్లాడుతూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా సభలు నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న బూటకపు హామీలు అన్నారు. వాటి అమలులో విఫలమవడం ఆపార్టీకి అలవాటేనాన్నారు. అందుకు కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమన్నారు. అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి నిరసన తెలుపుతున్నారని గుర్తుచేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకొని కోట్లకు పడగలేత్తారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు లింగారెడ్డి, బుట్టి శివకుమార్, ధమ్మపాల్, యాసం నర్సింగ్ రావు, కొండ గణేశ్, పర్వీన్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 8 : గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రతతో సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రజలకు ఓటు అడిగే హక్కు తమకే ఉందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని నిరాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ సునంద-ప్రభాకర్ భారీ గజమాలతో స్వాగతం పలికి డప్పు డోలు వాయిద్యంతో పటాకులు కాలుస్తూ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా రోడ్ షోలో జోగు రామన్న మాట్లాడుతూ నిరాల గ్రామంలోనే రూ.3 కోట్లు 53 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మిగిలిన పనులను సైతం పూర్తి చేస్తామన్నారు. హిందూ, ముస్లింలను గొడవలు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయం బీజేపీ చేస్తోందన్నారు.
నల్లధనాన్ని మహిళల అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని, మహిళలు, నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. అలాగే పట్టపగలు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి, రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందన్న కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. రైతుబంధు రూ.16 వేలు, రూ.400 గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు, తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ రూ.5లక్షల బీమా పథకం, ఆరోగ్యపథకం కింద రూ.15లక్షలు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తి వేస్తున్నారన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరాలలో పర్ధాన్ సమాజ్ యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామగ్రామాన చేపట్టిన సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్‌రావ్, చంద్రయ్య, సర్పంచ్ నంద ప్రభాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.