ఎదులాపురం, డిసెంబర్ 28 : ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రోగులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిమ్స్‌ను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. మొదట మార్చురీ కేంద్రం వద్ద రోగుల సహాయకుల విశ్రాంతి కోసం రూ.23 లక్షలతో నిర్మించిన గదులు, షెడ్లను పరిశీలించారు. ఐసీయూలో ఉన్న చిన్నారులకు తల్లి పాలివ్వడానికి రూ.19 లక్షలతో ప్రత్యేకంగా నిర్మించిన వార్డులో చేస్తున్న పనులను పరిశీలించి, త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం గైనిక్ వార్డు, మెటర్నిటీ ఐసీయూ వార్డుల్లోని రోగులను పలుకరించారు. వారికి అందిస్తున్న వైద్యసేవలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, రూరల్ మండలం యాపల్గూడకు చెందిన రాణి ఈ నెల 14న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సీజేరియన్ చేయగా, కుట్ల నుంచి చీము రావడంతో మళ్లీ కుట్లు వేశారు. ఇలా మూడు సార్లు వేయడంతో తాను పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు చెబుతూ కన్నీరు పెట్టుకున్నది. దీంతో రాణి కే షీట్‌ను పరిశీలించిన కలెక్టర్.. అక్కడి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాణికి మెరుగైన చికిత్సలు చేసి ఈ విషయం తనకు తెలియజేయాలని రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్‌కు సూచించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన గర్భిణులకు రిమ్స్‌లో వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రక్తహీనత ఉన్నందున వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. దవాఖాన ప్రాంగణంలో పనికి రాని, పాడుబడిన ఇనుప బెడ్లను స్క్రాప్ కింద తొలగించాలని సూచించారు. అంతకుముందు రిమ్స్ డైరెక్టర్ చాంబర్లో వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆమె వెంట వైద్యులు ఇద్రీస్ అక్బానీ, విజయసారథి, టీఎస్ఎంఐడీసీ ఈఈ కుమార్ తదితరులున్నారు.
‘తొలిమెట్టు’ను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి ప్రత్యేక బోధన చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో తొలిమెట్టు కార్యక్రమం అమలు , పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం వంటి అంశాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పెంచే దిశగా చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
తొలిమెట్టు కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచేలా ఉపాధ్యాయు వర్గం కృషి చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. రాష్ట్ర దేశ స్థాయిలోని ఉన్నత అధికారులు, మంత్రులు, తొలిమెట్టు కార్యక్రమం అమలుపై సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టెన్ ప్లస్ గ్రేడ్ వచ్చేలా విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, డీఈవో ప్రణీత, సెక్టోరల్ అధికారి కే నర్సయ్య, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.