బోథ్, డిసెంబర్ 4 : 18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్, బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు ఫారం-6 ద్వారా బూత్ లెవల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంవత్సరంలో అడుగు పెడుతున్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలని పేర్కొన్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, సవరణల కోసం సంబంధిత బీఎల్వోలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు రోజులతో పాటు ఎవరైనా దరఖాస్తులు చేసుకోలేకపోతే తమ గ్రామాల బీఎల్వోలకు ఫారాలు నింపి అందజేయవచ్చని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అతికొద్దీన్, నోడల్ అధికారి లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, గిర్దావర్ దశరథ్, సర్పంచ్ జీ సురేందర్‌యాదవ్ తదితరులు ఉన్నారు.
కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
ఇచ్చోడ, డిసెంబర్ 4 : మండలకేంద్రంలోని ఎనిమిది పోలింగ్ బూత్‌లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులను ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. నాలుగు రోజుల నుంచి నమోదు చేస్తున్న వివరాలను సంబంధిత బీఎల్వోలు, తహసీల్దార్‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో 100శాతం ఓటరు నమోదు కార్యక్రమం రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఈఆర్వో, తహసీల్దార్ మోహన్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ రామారావు, సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, నాయకులు దేవానంద్, వీఆర్ఏ గంగయ్య, పోలింగ్ బూత్ లెవెల్ అధికారులు అనసూయ తదితరులు పాల్గొన్నారు.