ఎదులాపురం, డిసెంబర్ 21 : ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి, నారొటిక్ మత్తు పదార్థాలను అంతం చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో అధికారులతో నారొటిక్-కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన ప్రజలు పడకుండా అవగాహన చేపట్టాలని తెలిపారు. సారథి కళాకారులతో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఏడాది 75 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు 987.425 కిలోల గంజాయిని పట్టుకుని, సుమారు రూ.2.31 కోట్ల గంజాయిని పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ అడె శ్రీలత పాల్గొన్నారు.
ప్రతి నెల తనిఖీలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.