భైంసా/ఇచ్చోడ/ఉట్నూర్ రూరల్/తాంసి/ఇంద్రవెల్లి/భీంపూర్, ఫిబ్రవరి 22 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న నేలకొరిగాయి. మామిడి తోటలో పిందెలు రాలాయి. ఇంద్రవెల్లి మండలంలోని మండలంలోని ధనోరా(బీ), ఇన్కర్గూడ, దేవాపూర్, ముత్నూర్, గౌరాపూర్, దోడంద, గట్టేపల్లి గ్రామాల్లో మొక్కజొన్న, గోధుమ పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు నెలకొరిగాయి.
ఖానాపూర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైనే వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు, చిరు వ్యాపారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. తాంసి మండలంలోని పొన్నారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంసి పోలీసులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. వృక్షం నేలకొరిగి మరోవైపు విద్యుత్ తీగలు తెగిపోయి పొన్నారిలో సుమారు నాలుగు గంటలపాటు కరెంటు లేకపోవడంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు.
భైంసాలో వారసంత అస్తవ్యస్తమైంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీగంజ్లోకి శనగ కొనుగోలుకు తీసుకొచ్చిన రైతులు చేతికొచ్చిన పంటను కాపాడుకునేందు ఇబ్బందులు పడ్డారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
భీంపూర్ మండల సరిహద్దు గుబిడి గ్రామంలో గాలివానకు శబరిమాత ఆలయ సమీప విద్యుత్ స్తంభం నేలకొరిగింది. విద్యుత్ తీగలు తెగిపోయాయి. గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. పాఠశాల కూడా దగ్గరగా ఉండడంతో సెలవు సమయం కావడంతో పిల్లలకు కూడా ప్రమాదం తప్పినట్లయింది. ఇళ్లపై రేకులు, పాత పెంకుటిళ్ల గోడలు కూలాయి.