నస్పూర్, మే 15 : జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి అనిత, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లుతో కలిసి డెంగీ వ్యాధి నివారణపై ఫ్లెక్సీ, కరపత్రాలను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా డెంగీ వ్యాధి వ్యాప్తి, నియంత్రణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పల్లె దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉప కేంద్రాలకు కరపత్రాలు, ఫ్లెక్సీలు, పోస్టర్లను పంపించినట్లు తెలిపారు. ఇండ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సాంకేతిక పర్యవేక్షకుడు సంతోష్, అధికారులు పాల్గొన్నారు.