కోటపల్లి, జూన్ 13 : రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. గురువారం కోటపల్లి, సర్వాయిపేట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయాల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్ వద్ద విత్తనాలు, ఎరువుల స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రశీదులు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. ఆధీకృత డీలర్ వద్దే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, కలిగి ఉన్నా చర్యలు తప్పవని, రైతులకు నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు లేక వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో మహేందర్ పాల్గొన్నారు.