కాగజ్‌నగర్, జూలై 29 : విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. మం గళవారం ఉదయం కాగజ్‌నగర్ పట్టణంలోని సీహెచ్‌సీని ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, సౌకర్యాలపై ఆరా తీశారు. నంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దవాఖానలో మందులు అందుబాటులో ఉన్నాయని, సీజనల్ వ్యాధుల ప్రభావం అంతగా లేదని స్పష్టం చేశారు. దవాఖానలో వసతులు కల్పిస్తామని, అవసరం మేరకు సిబ్బందిని నియమిస్తామని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆటోమెటిక్‌గా జనరేటర్ ఆన్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదని, మూడేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ జమ కావడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన స్పందిస్తూ అవుట్ సోర్సింగ్‌కు సంబంధించిన నిధులు మంజూరు చేశారని, ఎక్కడో జాప్యం జరుగుతుందని చెప్పారు. దవాఖాన సూపరింటెండెంట్ అందుబాటులో ఉండరని, ఫోన్ ఎత్తడని జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఫోన్లో కూడా వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లోని 30 పడకల దవాఖానను 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగజ్‌నగర్ డివిజన్లోని ఏడు మండలాల ప్రజల సౌకర్యార్థం సీహెచ్‌సీలో నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం అందుబాటులో ఉండేలా గైనకాలజిస్ట్ వైద్యురాలిని నియమించాలన్నారు. బెజ్జూర్ మండలానికి 30 పడకల దవాఖాన మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చ లేదని, పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. ఆ వైపు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర అధికారులు శ్రీనివాస్, నరేశ్, జితేందర్, డీఎంహెచ్‌వో సీతారాం, సూపరింటెండెంట్ చెన్న కేశవ, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, జూలై 29 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో అందుతున్న సేవలు, సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆసిఫాబాద్ కలెక్టరేట్‌కు రాగా, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీఎంహెచ్‌వో సీతారాం, ప్రభుత్వ హాస్పిటల్ పర్యవేక్షకుడు చెన్న కేశవ్, వైద్యులు పాల్గొన్నారు.
జైనూర్, జూలై 29 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల తనిఖీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ మంగళవారం జైనూర్ మండల కేంద్రానికి ఇలా వచ్చి.. అలా వెళ్లారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, బీఆర్ఎస్ యువ నాయకుడు సతీశ్ ముడే అన్నారు. ప్రభుత్వ దవాఖానలో కనీసం సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతుంటే, కనీసం హాస్పిటల్లో కాలు పెట్టకుండా రోడ్డుపైనే నాయకులు, వైద్యులతో మాట్లాడి వెళ్లిపోయారని, ప్రజా పాలన.. ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.