తాండూర్ : పంచాయతీల అధికారులు, సిబ్బంది పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వర్ రావు ( DPO Venkateshwar Rao ) హెచ్చరించారు. మండలంలోని రేచిని, చౌటపల్లి గ్రామపంచాయతీ లను బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కె సతీష్ కుమార్తో కలిసి సోమవారం సందర్శించారు.
చౌటపల్లి గ్రామపంచాయతీ సీఎం- ఏజేఏవై పథకానికి ఎంపికైన సందర్భంగా ఎంపిక చేసిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు అందరికీ అందే విధంగా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు దిశా నిర్దేశం దేశారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించారు. మురికి నీటి కాలువ చివరలో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు.
రేచిని గ్రామపంచాయతీ పరిధిలో డ్రైన్స్, వాటర్ పంపులు, ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేసి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. నర్సరీ, వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వారి వెంట ఎంపీడీవో పీ శ్రీనివాస్, ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచులు ముదాం సునీత, పోతురాజుల రాంబాయి, కార్యదర్శులు శ్రీనివాస్, వసంత, సిబ్బంది ఉన్నారు.