ఎదులాపురం, డిసెంబర్ 23: సామాన్యులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న పోలీసులు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీలో సర్వే 170లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న వారిని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేశారు.
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులైనా ఇంకా చర్యలు తీసుకోలేదన్నారు. బెదిరించడం, కులం పేరుతో దూషించినందుకు గాను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెట్టి మనోజ్, సలాం వరుణ్, గోడం రేణుకాబాయి, ఉయిక ఇంద్ర, సోయం లలిత, ఆత్రం గణపతి, వెడ్మ ముఖుంద్ పాల్గొన్నారు.