నిర్మల్, జూన్ 18(నమస్తే తెలంగాణ) : గత యాసంగి సంబంధించిన రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరా బాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయడం గందరగోళానికి తావిస్తున్నది. యాసంగి రైతు భరోసా ఇస్తారో లేదోనని 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మూడు సీజన్లలో.. రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులను ఎగ్గొట్టిందని, గత యాసంగి సీజన్లో కేవలం 4 ఎకరాల్లోపు రైతులకే భరోసా సాయాన్ని అందించిందని రైతులు విమర్శిస్తున్నారు. పాత బకాయిలను చెల్లించకుండా, రైతుల దృష్టిని మళ్లించేందుకు, రాజకీయ విమర్శలను తప్పించుకునేందుకు ఈ సారి ప్రతిరైతుకూ పూర్తి స్థాయిలో భరోసా సాయాన్ని అందిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
యాసంగి రైతు భరోసా బకాయి రూ.131 కోట్లు..
గత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులకు రూ.131 కోట్లు బకాయి ఉన్నది. జిల్లాలో మొత్తం లక్షా ఎనభై ఆరు వేల మంది రైతులు రైతుభరోసా పథకానికి అర్హులున్నారు. వీరికి యాసంగి సీజన్‌కు గాను రూ.252 కోట్ల డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నది. అయితే ఆ సీజన్ చివరి నాటికి కేవలం 4 ఎకరాల్లోపు ఉన్న 1,36,000 మంది రైతులకు మాత్రమే రూ.121 కోట్లు జమ చేశారు.
ఇంకా జిల్లాలోని 50వేల మంది రైతులకు రైతు భరోసా కింద 131 కోట్లు జమ కావాల్సి ఉన్నది. ఈ బకాయిలను చెల్లించకుండానే ప్రస్తుతం వానకాలం సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అంతకుముందు రెండు సీజన్ల డబ్బులను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ సారి అయినా అందరికీ సాయాన్ని అందిస్తుందో లేదో అన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సీజన్‌కు ముందే ఠంచన్‌గా పెట్టుబడి సాయాన్ని అందించేదని, ఇంతలా ప్రచారం చేస్తూ సాగదీసేది కాదని రైతులు గత ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
అర్హుల జాబితాపై అనుమానాలు !
ఈ సారి రైతు భరోసా అర్హుల జాబితా రూపకల్పనపై సైతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రైతుకూ భరో సా సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు చేసిన భూములకే పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పింది. కాని క్షేత్ర స్థాయిలో సాగు భూము ల సర్వేను పక్కాగా లెక్కించకుండానే సంబంధిత అధికారులు ఇష్టారీతిన జాబితాను రూపొందించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రస్తుతం చాలామంది రైతులకు సంబంధించిన భూముల వివరాలు జాబితాలో అందుబాటులో లేకపోవడం, మరికొంత మందికి రైతు భరోసా నిధులు జమ కాకపోతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక అధికారులు ఇప్పటికే సాగులో ఉన్న భూములకు సంబంధించి అందుబాటులో ఉన్న అరకొర సమాచారాన్ని చేరవేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే భూములను కొనుగోలు చేసిన రైతుల వివరాలతో పాటు, కొత్తగా సాగులోకి వచ్చిన భూముల వివరాలపై పూర్తి స్థాయిలో సర్వే చేయకుండానే జాబితాను విడుదల చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు ఈసారి రైతు భరోసా అందే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం సైతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా అధికారులందించిన ప్రాథమిక వివరాల ఆధారంగానే రైతు భరోసాను అందించి భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటుండడం విమర్శలకు తావిస్తున్నది.
ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు భరోసాపై ఈ సారి ప్రభుత్వం పథకం ప్రకారం సోషల్ మీడియాలో సోమవారం మధ్యాహ్నం నుంచే ముందస్తు ప్రచారం మొదలు పెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు ప్రచారాన్ని ముమ్మరం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా ఏ సీజన్లో కూడా పంటలు వేయకముందు రైతు భరోసా సాయాన్ని అందించకపోగా, సీజన్ ముగిసినా వేలాది మంది రైతులకు నేటికీ గత యాసంగి సీజన్ డబ్బులు జమకాలేదు.
ఈ సారి ఎలాంటి పంటల నమోదు సర్వే ప్రక్రియ పూర్తి కాకుండానే అధికారులు తమకున్న సమాచారం మేరకే జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెబుతున్నారు. దీంతో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసాకు అర్హులైన వారికి సంబంధించిన జాబితా వివరాలను అధికారులు బహిరంగంగా వెల్లడించకపోతుండడంపై రైతులు మండిపడుతున్నారు. రైతు భరోసా డబ్బులు పొందిన వారికి నేరుగా వారి సెల్‌ఫోన్‌కే మెసేజ్ వస్తున్న కారణంగా, మిగతా వారికి దీనికి సంబంధించిన సమాచారం తెలియడం లేదు. దీంతో ఇటు జాబితా రూపకల్పన విషయంలోనూ, అటు అర్హుల ఎంపిక, నిధుల పంపిణీ విషయంలో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం ఈ సారి ఆఘ మేఘాలపై రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
స్థానిక ఎన్నికల కోసమే కాంగ్రెస్ జిమ్మిక్కులు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం..త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉండడంతో రైతు భరోసా పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నది. ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా స్థానిక ఎన్నికల్లో ఓట మి ఖాయం. 18 నెలలుగా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసింది. రైతు భరోసాతో పాటు, రుణమాఫీని అందరికీ వర్తింపజేయకపోవడంతో వేలాది మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ గ్రహంగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు ఉన్నాయని ఆదరా బాదరాగా రైతు భరోసా ఇచ్చినంత మాత్రాన ఓట్లు రాలవు. మూడు సీజన్లలో రెండు సీజన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులను పూర్తిగా ఎగ్గొట్టి రైతులను మో సం చేసింది ఈ ప్రభుత్వం. పోయిన యాసంగిలో కేవలం 4 ఎకరాల్లోపు ఉన్న రైతులకే రైతు భరోసా సా యం అందించింది. మిగ తా రైతులంతా యాసంగి భరోసా డబ్బుల కోసం ఇ ప్పటికీ ఎదురు చూస్తున్న రు.
పెండింగ్‌లో ఉన్న గత సీజన్లకు సంబంధించి రైతు భరోసా డబ్బులపై స్పష్టత లేకుండానే ప్రస్తుత వానకాలం సీజన్ కోసం డబ్బులను వేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ సకాలంలో పెట్టుబడి సాయం అందింది. ఇప్పటికైనా ప్రచారాన్ని పక్కనపెట్టి ప్రస్తుత వానకాలం సీజన్‌తో పాటు రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతులకు నిరంతరం అండగా ఉంటూ, వారికి సంబంధించి మొత్తం బకాయిలు చెల్లించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో పోరాడుతుంది.
– డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయకర్త