Asifabad | కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండల పరిధిలో విషాదం నెలకొంది. అడవి పంది దాడిలో ఓ 55 ఏండ్ల మహిళా కూలీ మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే.. చింతలమానేపల్లి మండల పరిధిలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన దుబ్బుల లక్ష్మీ(55) శనివారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి పయనమైంది. మార్గమధ్యలో చెట్ల పొదల్లో ఉన్న ఓ అడవి పంది.. లక్ష్మీపై ఆకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది.
గ్రామస్తులందరూ కలిసి ఆమెను కాగజ్నగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆమె ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆమె బుధవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అడవి పంది దాడిలో దుబ్బుల లక్ష్మీ చనిపోవడంతో.. ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని అటవీశాఖ అధికారులను కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.