చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 21 : స్వచ్ఛ్ భార త్ మిషన్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట పంచాయతీని రాష్ట్ర స్థాయి అవార్డు వరించింది. పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించినందుకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు లభించింది.
కిష్టంపేటకు నిధుల వరద
చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సహకారంతో కిష్టంపేట గ్రామపంచాయతీకి నిధుల వరద పారింది. రూ. 3 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 15 లక్షలతో శ్మశాన వాటిక, రూ. 6 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.7 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం, రూ.23 లక్షలతో రైతు వేదిక, రూ. 2 లక్షలతో క్రీడా ప్రాంగణం, రూ. 3 లక్షలతో డంప్‌యార్డుల నిర్మాణంతోపాటు రూ.8 లక్షలతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో రూ.3 లక్షలతో కిష్టంపేట పేరిట ఏర్పాటు చేసిన ఆకృతి ఆకట్టుకుంటోంది. రూ. 8 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. ప్లాస్టిక్ నివారణలో భాగంగా రూ. లక్షతో ప్లాస్టిక్ కాటన్ జ్యూట్ బ్యాగులను తయారు చేసి ఇంటింటికీ పంపిణీ చేశారు. రూ. 80 వేలతో ప్రధాన కూడళ్ల వద్ద చెత్త సేకరణకు డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారు.
వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు..
కిష్టంపేటలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యంతో విస్తృతంగా ప్రచారం చేసి వందశాతం పూర్తి చేశారు. అలాగే కాలనీల్లో నిరు నిల్వకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామ పరిశుభ్రతకు కృషి చేశారు. జీపీ ట్రాక్టర్‌తో తడి, పొడి చెత్తను సేకరించి డంప్‌యార్డుకు తరలించారు. సేకరించిన చెత్తను తూకానికి అమ్మి గ్రామపంచాయతీకి నిధులు సమకూర్చడం వంటివి చేపట్టారు. 100 శాతం స్వచ్ఛత గ్రామం కావడంతో మొదట కిష్టంపేటను స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఇటీవల హైదరాబాద్‌లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ దివాకర్‌కు అవార్డు అందించారు. గ్రామానికి రూ. 10 లక్షల నగదు పురస్కారం ప్రభుత్వం అందిస్తుంది.
గ్రామస్తులు సహకరించారు
కిష్టంపేట గ్రామపంచాయతీకి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 17 ఏళ్లుగా పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నా. ఏ ప్రభుత్వం మా సేవలను గుర్తించలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక సెక్రటరీల సేవలకు గుర్తింపు లభిస్తుంది. గ్రామస్తులు, పాలక వర్గం సహకారంతోనే రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది.
– దివాకర్, పంచాయతీ సెక్రటరీ, కిష్టంపేట
విప్ సహకారంతోనే అభివృద్ధి
కిష్టంపేట అభివృద్ధికి విప్ బాల్క సుమన్ ఎంతో సహకరించారు. అడిగిన వెంటనే నిధులుమంజూరు చేయించారు. నిత్యం మా గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులను పరిశీలించారు. సలహాలు, సూచనలు చేశారు. నేను సర్పంచ్‌గా ఉన్న సమయంలో కిష్టంపేట గ్రామపంచాయతీకి రాష్ట్రస్థాయి అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇందుకు సుమన్ అన్నకు రుణపడి ఉంటా.
– బుర్ర రాకేశ్ గౌడ్, సర్పంచ్, కిష్టంపేట
అవార్డు రావడం గొప్ప విషయం
కిష్టంపేట గ్రామపంచాయతీకి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం గొప్ప విషయం. ఎంతో సంతోషంగా ఉంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, సెక్రటరీ దివాకర్ ఎంతగానో సహకరించారు. కిష్టంపేట గ్రామపంచాయతీ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. మా ఊరును ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకులు, అధికారులకు ధన్యవాదాలు.
– కుర్మ సాయి, గ్రామస్తుడు, కిష్టంపేట