కాగజ్‌నగర్ డివిజన్లో సంచరిస్తున్న పులి ప్రజలను హడలెత్తిస్తున్నది. శుక్రవారం గన్నారం సమీపంలో పత్తి ఏరుతున్న మోర్ల లక్ష్మిపై దాడి చేసి చంపగా, ఆ ఘటన నుంచి తేరుకోకముందే శనివారం సిర్పూర్-టీ మండలం దుబ్బగూడలో రైతు సురేశ్‌పై పంజా విసిరింది. ఆ యువకుడు తన చేతిలోని గొడ్డలితో పులిపై ఎదురు దాడికి దిగడంతో అది అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ రైతును కాగజ్‌నగర్‌కు తరలించి అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు.
పత్తి చేనుకు వెళ్లగా..
దుబ్బగూడకు చెందిన సురేశ్, అతడి భా ర్య సుజాత శనివారం మధ్యాహ్నం స మీపంలోని పత్తి చేనుకు వెళ్లారు. ఇద్ద రు కలిసి పత్తి తీస్తుండగా, పొదల్లో శబ్ధం వినిపించింది. అడవి పందు లు కావచ్చని చెదరగొట్టేందుకు సురేశ్ ఆ వైపు వెళ్లాడు. పొదల్లో రెండు పులులున్నాయని, అందులోని ఒక పులి సురేశ్‌పై దాడి చేసిందని ప్రత్యక్ష సాక్షి అయిన సుజాత ద్వారా తెలిసిం ది. సురేశ్‌పై పులి దాడి చేస్తున్నట్లు గమనించిన సుజాత కేకలు వేస్తూ.. అక్కడికి వెళ్లి కర్రలు.. రాళ్లతో పులిని కొట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే సురేశ్ మెడపై దాడి చేసిన పులి అతడిని కొంత దూరం లాక్కెళ్లింది. సురేశ్ కూడా గొడ్డలితో ఎదురుదాడి చేయడం.. అదే సమయంలో చుట్టు పక్క రైతులు, కూలీలు అక్కడికి రావడంతో పులి సురేశ్‌ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ సురేశ్‌ను హుటాహుటిన సిర్పూర్-టీ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాగజ్‌నగర్‌లోని దవాఖానకు ..అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు.
వరుస ఘటనలతో భయాందోళనలు
కాగజ్‌నగర్ డివిజన్లో పులుల దాడి ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. శుక్రవారం గన్నారం లో మోర్లె లక్ష్మిపై పులి దాడి చేసి చంపే వరకూ అటవీ అధికారులు దాని జాడ గుర్తించలేకపోయారు. గన్నారంలో ఘటన జరిగిన తర్వాత కూడా పులి సంచారాన్ని గుర్తించడంలో అటవీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శనివారం ఉదయం సిర్పూర్ మండలంలోని పెద్ద బండ, దుబ్బగూడ ప్రాంతాల్లో పులిని చూసిన కొంత మంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారం క్రితం వరకు కెరమెరి, వాంకిడి, జైనూర్, తిర్యాణి మండలాల్లో సంచరించిన పులి పశువులపై దాడి చేసింది. వాంకిడి మండలంలోని మహారాష్ట్ర బార్డర్ హైవే పక్కన సంచరించిన పులి ఎక్కడికి వెళ్లిందో అధికారులు ఇప్పటి వరకు ట్రాక్చేయలేకపోయారు. రెండు రోజులుగా కాగజ్‌నగర్ డివిజన్లోని గన్నారం, దుబ్బగూడ ప్రాంతాల్లో తిరుగుతూ రైతులు, కూలీలపై పంజా విసురుతున్నా అధికారులు గుర్తించలేకపోతున్నారు. సంతానోత్పత్తి సీజన్ కావడంతో ఆడ పులి కోసం మగ పులులు వలస వస్తాయని అటవీ అధికారులకు తెలిసినప్పపటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డ్రోన్ సాయంతో జల్లెడ
కాగజ్‌నగర్ కారిడార్‌లో పెద్దపులి హల్చల్ చేస్తున్నది. మనుషులపై దాడులు చేస్తూ కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నది. ఈ క్రమంలో అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అటవీ ప్రాంతాలో 144 సెక్షన్ అమలు చేశారు. దుర్గానగర్, గన్నారం, విలేజ్ నంబర్ 6, 10, 11, 9 తదితర అటవీ ప్రాంతాల్లో శనివారం వేకువ జాము నుంచే డ్రోన్ సాయంతో అడవులను జల్లెడ పట్టారు. వైల్డ్ లైఫ్ ట్రాకర్, 40 మంది సిబ్బంది ఆరు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నారు. పులి ఆచూకీ లభించకపోగా సిర్పూర్ (టీ) మండల అటవీ ప్రాంతానికి పెద్ద పులి వెళినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఎస్-10, కే-8 పులులతో పాటు కొత్తది!
కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో రెండు పులులున్నట్లు గుర్తించినప్పటికీ ఇటీవల మూడో పులి ప్రవేశించినట్లు తెలిసింది. దాడులు చేస్తున్నది కొత్తపులి కావచ్చని భావిస్తున్నారు. సిర్పూర్ (టీ)అటవీ ప్రాంతంలో ఎస్-10 ఆడ పులి సంచరిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగజ్‌నగర్, సిర్పూర్.. మహారాష్ట్ర అటవీ ప్రాంతాలకు పులి రాకపోకలు సాగిస్తున్నట్లు యానిమల్స్ ట్రాకర్స్ స్పష్టం చేస్తున్నారు. ఇకా కే-10 మగ పెద్దపులి బెజ్జూర్, పెంచికలపేట్ మండలాల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు వారు గుర్తించారు.
చేలల్లోనే తెల్లబంగారం
జిల్లాల్లో కూలీలు దొరకక చేలల్లోనే తెల్లబంగారం ఉండిపోతున్నది. దీనికి తోడు పులి అలజడితో కూలీలు భయపడిపోతున్నారు. గతేడాది మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చినా.. ఈసారి మహారాష్ట్రలో ఎన్నికలుండడం వల్ల తకువ మంది వచ్చారు. ఒకవేళ ఏరడానికి ముందుకొచ్చినా కిలోకు రూ. 12 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నా కళ్ల ముందే దాడి చేసింది
ఎప్పటిలాగే ఈ రోజు కూడా పత్తి ఏరడానికి పోయిన. నా భర్త కంటే ముందే నేను వెళ్లిన. ఆ తర్వాత ఆయన ఎడ్ల బండితో వచ్చిండు. నేను ఓ దిక్కు పత్తి ఏరుతున్న. చేను వద్దకు చేరుకున్న భర్త సురేశ్‌పై నా కళ్లముందే పులి దాడి చేసింది. వెంటనే కేకలు వేసిన. నా భర్త చేతిలో ఉన్న గొడ్డలితో పులిపై దాడిచేసిండు. దీంతో పులి అడవిలోకి పారిపోయింది. వెంటనే మా బంధువులకు ఫోన్ చేసి చెప్పిన. నా భర్త సురేశ్‌ను తీసుకొని కొద్ది దూరం నడిచిన.. మా బంధువులు వచ్చి దవాఖానకు తీసుకెళ్లారు. – సురేశ్ భార్య సుజాత